రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాల్చింది. ఖరీఫ్ పంటలకు అక్టోబర్‌లో కురిసే వర్షాలు కీలకం కాగా, సరిగ్గా ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావం తిష్టవేసింది. ఈ నెల 1 నుంచి 27 వరకు పడాల్సిన సాధారణ వర్షంలో ఏకంగా 89 శాతం తక్కువ వర్షం నమోదైంది. అన్ని జిల్లాలూ అత్యల్పవర్షం కేటగిరిలో మగ్గుతున్నాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం తరుణంలో సాధారణంగా వానలు కురుస్తాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడతాయి. కానీ ఈ మారు చినుకు పడకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే ఖరీఫ్ సీజన్ మొదటి నుంచీ వర్షాభావం నెలకొంది. దాంతో లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదు. సాగైన పంటలకు రక్షక తడులు ఖర్చుతో కూడుకున్నాయి. ఈ సమయం లోనైనా వానలు పడతాయని, వేసిన పంటలకు ఊపిరి పోస్తాయని ఆశగా ఎదురు చూస్తుండగా, ఇప్పుడు కూడా అన్నదాతలకు నిరాశే ఎదురైందిఅక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు నార్మల్ వర్షం 126.9 మిల్లీమీటర్లకు గాను కేవలం 13.7 మిమీ కురిసింది.
ప్రాంతాలవారీగా చూస్తే కోస్తాలో 88 శాతం, రాయలసీమలో 90 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. కర్నూలులో 99 శాతం తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో ఇదే కనిష్ట వర్షపాతం. అంటే ఈ 24 రోజుల్లో కర్నూలు జిల్లాలో అస్సలు చినుకు పడనట్లే లెక్క. ఆ తర్వాత నెల్లూరులో 98 శాతం తక్కువ వర్షం కురిసింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. చిత్తూరులో 66 శాతం తక్కువ వర్షం పడింది. అన్ని జిల్లాల్లోకెల్ల ఉన్నంతలో మెరుగైన జిల్లా ఇదే. వర్షపు లోటు 90 శాతం కంటే ఎక్కువ ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్‌టిఆర్, గుంటూరు, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, వైఎస్‌ఆర్, శ్రీసత్యసాయి.ఖరీఫ్ మొదటి నుంచీ చూసినట్లయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య నార్మల్ వర్షం 719.6 మిమీ పడాల్సి ఉండగా 504 మిమీ పడింది. లోటు 29.8 శాతం. ఏకంగా 18 జిల్లాల్లో తక్కువ వర్షం నమోదైంది. కేవలం 8 జిల్లాల్లోనే సాధారణ వర్షం పడింది.
రాష్ట్రంలో అర్బన్, రూరల్ కలుపుకొని 669 మండలాలుండగా మంగళవారం సాయంత్రానికి 440 మండలాల్లో మైనస్ వర్షం నమోదైంది. మరీ 32 మండలాల్లో దుర్భిక్షం నెలకొంది. అక్టోబర్‌లో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో ఖరీఫ్ పంటలు ఎండుతున్నాయని, భూగర్భజలాలు లోతుల్లోకి పోతున్నాయని, విద్యుత్ కోతలు పంటలను నర్వనాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.