tel-bjp
తెలంగాణ రాజకీయం

టీ బీజేపీకి..దారేదీ…

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఒక్కరొక్కరుగా అగ్రనేతలు దూరం అవుతున్నారు. తెలంగాణలో అధికారమే  తరువాయి అంటూ ఆర్భాటంగా ఇతర పార్టీల నుంచీ చేరికల  కోసం ఏకంగా  చేరికల క మిటీనే ఏర్పాటు చేసి, ఆ కమిటీ సారథ్య బాధ్యతలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటలకు అప్పగించినా కూడా.. ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేవారికి విశ్వసనీయత కలిగిన ఆప్షన్ గా కనిపించడం లేదు సరికదా ఇప్పటికే పార్టీలో ఉన్న వారు కూడా మునిగిపోయే నావను ఎలా నమ్ముకుంటాం అనుకుంటున్నారో ఏమో ఒక్కరొక్కరుగా  పార్టీని వీడుతున్నారు.అలా వీడుతున్నట్లు ప్రకటిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన రాష్ట్ర బీజేపీ నాయకులకే కాదు, ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

గతంలో  తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి కారణం.. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే అప్పట్లో బీజేపీయే సరైన పార్టీగా కనిపించిందనీ, అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భావించి, శాసన సభ్యత్వాన్ని కూడా వదులుకుని రాజీనామా చేసి బీజేపీలో చేరాననీ గుర్తు చేసిన ఆయన ఇప్పుడు బీజేపీని వీడడానికి కూడా అదే కారణం చెప్పారు.  బీఆర్ఎస్ తో గట్టిగా తలపడుతుందని భావించిన బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఆ కారణంగానే పార్టీ వీడుతున్నానని అన్నారు.  ఈ వ్యాఖ్యలతో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బలం చేకూర్చారు. ఇప్పుడు తాజాగా  మాజీ ఎంపీ  వివేక్  కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. రేవంత్ రెడ్డితో ఆయన దాదాపు గంటన్నర పాటు చర్చలు జరపడమే కాకుండా, అందుకు సంబంధించిన పొటో కూడా విడుదల చేయడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.  

మాజీ ఎంపీ వివేక్ సోదరుడు ఇప్పటికే బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.   మొయినాబాద్‌ లోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవంత్, వివేక్ భేటీ  ఫలవంతమైందనీ, ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఇక లాంఛనమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి ఇంత కాలం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ముక్త తెలంగాణ దిశగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.