- మరోసారి సబ్సిడీ గొర్రెల పంపిణీ
- గ్రామాల్లో మోడ్రన్ హెయిర్ సెలూన్లు
- మత్స్య, గీత కార్మికులకు సత్వర
- బీమా చెల్లింపులు నేతన్నలకు ఉచితంగా జీవిత బీమా
కులవృత్తులకు చేయూతనిస్తూ ప్రోత్సహించటం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్న రాష్ట్రప్రభుత్వం, దీన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. గొల్లకుర్మలకు సబ్బిడీపై ఇస్తున్న గొర్లను మరోసారి పంపిణీ చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థనుపరిపుష్టం చేయాలన్న సంకల్పంతో యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీచేసే కార్యక్రమాన్ని నాలుగేండ్ల క్రితం ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. ఒక్కో యూనిట్‌కు రూ.1 లక్షా 25 వేలు ఖర్చు అవుతుంది. ఇందులో 25 శాతం (రూ.31,250) లబ్ధిదారుడు భరించాలి. మిగతా 75 శాతం (రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రాష్ట్రంలో 7,925 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలుండగా, వాటిలో 7,61,895 మంది సభ్యులుగా వున్నారు. దశలవారీగా చేస్తున్న గొర్ల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని శనివారం సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది
మత్య్సకారుల కోసం..
మత్స్యకారులకు ఉపాధి లభించేలా ప్రభుత్వం చేపల పెంపకాన్ని చేపట్టింది. చెరువుల్లో చేపలను పెంచే బెస్తలు (గంగపుత్రులు), ముదిరాజులతోపాటు ఇతర కులాల్లోని చేపల పెంపకందారులకు ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఐదేండ్లు (2016) గా కొనసాగిస్తున్నది.
నాయీ బ్రాహ్మణుల కోసం…
క్షవర వృత్తిలో ఉన్న నాయీ బ్రాహ్మణుల కోసం గతంలోనే నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మోడ్రన్ హెయిర్ సెలూన్లను తక్షణమే ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.400 కోట ్లభారాన్ని భరిస్తూ రాష్ట్రంలోని లాండ్రీషాపులు, దోభీఘాట్లు నిర్వహిస్తున్న రెండు లక్షల మందికి, 70వేల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
చేనేత కార్మికుల కోసం..
చేనేత కార్మికులకు బీమా చెల్లింపులను త్వరితగతిన అందించడానికి చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ ఆదేశించింది. చేనేత కార్మికులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించనుంది. వారి నుంచి ఒక్కపైసా వసూలు చేయకుండా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. జీవిత కాలం రెన్యూవల్ కూడా ప్రభుత్వమే చేస్తుంది. కేవలం దరఖాస్తు చేసుకుంటే జీవితాంతం బీమా వర్తిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో 30వేల మందికిపైగా లబ్ధి కలుగుతుంది.
గీత, మత్స్య కార్మికుల కోసం..
గీత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య, గీత కార్మికులకు అందించాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ వృత్తి కులాల అభివృద్ధి కోసం ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, కులవృత్తిదారులకు కూడా బీమా చెల్లింపులు ఉండాలని పేర్కొన్నది. గీత, మత్య్స కార్మికులకు రూ.6 లక్షల ప్రమాదబీమా పథకాన్ని 2015 నుంచి అమలుచేస్తున్న విషయం తెలిసిందే. గీత పారిశ్రామిక సంఘాలు, మత్య్సకార్మిక సంఘాల్లో పేర్లు నమోదు చేసుకున్న సభ్యులందరికీ బీమా సౌకర్యం లభిస్తుంది.