ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన పై ప్రభుత్వం మళ్ళీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పోలవరం కొనసాగుతోంది. పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన పైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన :జిల్లాల పునర్ విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జిల్లాల సంఖ్య తగ్గనుండగా, మరికొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉందని తెలిసింది. జిల్లాల సంఖ్యలో మార్పు లేకపోయినా.. మార్పులు దిశగా మాత్రం నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని సమాచారం. జిల్లాల ఏర్పాటు తరువాత వచ్చిన అభ్యర్దలు..డిమాండ్ల పైన అధ్యయనం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని మార్పులు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది.
అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. కడప జిల్లాను అలానే ఉంచి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని పైన కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలనే చర్చ వినిపిస్తోంది. గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన పార్వతిపురం మన్యం జిల్లా ఏర్పాటు నుండి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గనున్నట్లు సమాచారం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేసారు. అయితే, చిన్న జిల్లా కావడం, పాలనాపరంగా అసౌకర్యంగా ఉండటం వంటి కారణాలతో పార్వతిపురం మన్యం జిల్లాను రద్దు చేసి..ఆ స్థానంలో పోలవరం కేంద్రంగా కొత్తగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటి వరకు పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. మంత్రివర్గంలో నిర్ణయం:ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. దీనిపై పలు విజ్ఞప్తులు అందడంతో నూతన జిల్లా ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న వారికి పునరావాస పనులకు పరిపాలన సౌలభ్యం సులభమవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. మన్యం జిల్లాను రద్దు చేసినా పోలవరం జిల్లా ఏర్పాటు ద్వారా గిరిజన జిల్లాల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. అయితే, ఈ మొత్తం ప్రతిపాదనల పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.