తెలంగాణ రాజకీయం

మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య రెండు రోజులుగా వివాదం కొనసాగుతోంది. గాంధీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందారు. అయితే.. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని ఇచ్చింది. దాంతో అప్పటి నుంచి ఈ ఇద్దరి ఎమ్మెల్యేలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చీరె, గాజులు పంపుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే గాంధీ ఇంటికి వెళ్లి ఆయన మెడలో బీఆర్ఎస్ కండువా వేస్తానని.. ఆయన ఇంటి ముందు గులాబీ జెండా ఎగురవేస్తానంటూ సవాల్ చేశారు.దీనికి స్పందించిన గాంధీ ‘దమ్ముంటే నా ఇంటికి రావాలి’ అని ప్రతిసవాల్ చేశారు. లేదంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి రాకపోవడంతో.. ఆయన తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కౌశిక్ ఇంటికి చేరుకున్నారు.

ఆయన ఇంటిపై దాడికి దిగారు. దమ్ముంటే కౌశిక్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఫైనల్‌గా గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వివాదంలోకి ప్రాంతీయతను తీసుకొచ్చారు. ‘ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణకు బతకడానికి వచ్చాడు. ఆంధ్రోళ్లు దాడి చేస్తే తెలంగాణ వాళ్లం ఊరుకుంటామా. తెలంగాణ అంటే ఏంటో చూపిస్తాం’ అంటూ హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.మరోవైపు.. కౌశిక్ రెడ్డిపై దాడిచేయడాన్ని ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. తెలంగాణ ఎమ్మెల్యే, అదీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దాడిచేయడాన్ని ఆయన ఎలా చూస్తారని చర్చ కొనసాగుతోంది.దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన పాడి కౌశిక్‌రెడ్డి పోలీసుల తీరును తప్పు పట్టారు.

తాను నిఖార్సైన తెలంగాణ వాదినని.. గాంధీ తెలంగాణకు బతకడానికి వచ్చాడని ఆరోపించారు. తెలంగాణ వాడిపై దాడిచేస్తే తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో రేపు చూపిస్తా అని హెచ్చరించారు. నాన్‌లోకల్‌ వ్యాఖ్యలపై గాంధీ కూడా దీటుగా స్పందించారు. తెలంగాణ ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. కరీంనగర్ నుంచి కౌశిక్‌ హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడని ప్రశ్నించాడు. కఠిన పదాలను ఉపయోగించాడు. తాజాగా పాడి కౌశిక్‌రెడ్డి మాటలు ఇప్పుడు మళ్లీ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చాయి. అసలైన తెలంగాణవాదులం అని మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేపు తెలంగాణ సత్తా చూపుతామనడంతో ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ వాదులే అని గతంలోనే కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్‌రెడ్డి.. ఇప్పుడు వివాదాస్పద నాన్‌ లోకల్‌ అంటూ మాట్లాడడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశవైంది.

దీనిపై గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలిమొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఆంధ్రానాయకులను మాటల పరంగా టార్గెట్ చేశారే తప్పితే.. ఏనాడూ ఎవరూ భౌతిక దాడులకు దిగలేదు. తెలంగాణ వచ్చాక కూడా పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ సందర్భంలోనూ ఏనాడూ ఆంధ్ర వాళ్ల జోలికి వెళ్లలేదు. ఎందుకంటే.. కొంత మంది ఆంధ్రా సెటిలర్స్ కూడా ఆయనకు మద్దతు తెలిపారు. అరికెపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేనే. ఆయన పార్టీ మారినంత మాత్రాన కౌశిక్ రెడ్డి ఆంధ్ర నాయకుడిగా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమనే విమర్శ కూడా వినిపిస్తోంది.