తెలంగాణలో వింత పరిస్థితి ఎదురయ్యింది. ఓవైపు ఎన్నికల కోడ్.. మరోవైపు పెళ్లిళ్ల సీజన్. రెండు ఒకే సమయంలో రావడంతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శుభకార్యాలు పెట్టుకున్న వారికి డబ్బుతోనే పని… ఏ పని చేయాలన్న డబ్బు అవసరం. మరోవైపు ఎన్నికల కోడ్… ఎక్కువ డబ్బు బయటకు తీసుకెళ్తే.. సీజ్ చేస్తున్నారు పోలీసులు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.తెలంగాణలో ఇలా ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చిందో లేదో.. అదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైంది. అంతేకాదు… ఎన్నిక కౌంటర్ పూర్తయ్యే సమయానికి మంచి మూహూర్తాలు కూడా అయిపోతాయి. దీంతో ఈ సమయంలో శుభకార్యాలు పెట్టుకున్నారు చాలా మంది. మరి.. పెళ్లి అంటే మామూలు విషయం కాదు కదా. అంతా డబ్బుతోనే పని. షాపింగ్ దగ్గర నుంచి… మండపం బుకింగ్, మంగళవాయిద్యాలు, కేటరింగ్, డెకరేషన్ అరేంజ్‌మెంట్స్.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటికీ లక్షల రూపాయలు అవసరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో నగదు తీసుకెళ్లాల్సి వస్తుంది.
ఇదే.. ఇప్పుడు సమస్యగా మారింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు అడుగడుగునా చెకింగ్ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్తే వాటికి రసీదులు అడుగుతున్నారు. ఆధారాలు లేకపోతే నగదును సీజ్ చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు… రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి మరీ తనిఖీలు చేస్తున్నారు. బైక్‌లను కూడా వదలడంలేదు. అనధికార లావాదేవీలు ఉంటే.. వెంటనే డబ్బు సీజ్‌చేస్తున్నారు. ఈ పరిస్థితి… పెళ్లిళ్లు పెట్టుకున్న వారికి ఇబ్బందికరంగా మారింది.పెళ్లి అంటే.. లక్షల్లో ఖర్చవుతుంది. ఆ డబ్బును… అప్పుగానో.. లేక మరో విధంగానో సమకూర్చుకుంటారు కుటుంబసభ్యులు. అందులో అన్నింటికీ లెక్కలు ఉండవు. ఇక… పెళ్లిబట్టలు కొన్నాలన్నా లక్ష రూపాయల పైమాటే. ఇక నగల సంగతి చెప్పనక్కర్లేదు. పెద్ద మొత్తం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. అయితే.. షాపింగ్‌కు డబ్బుతో వెళ్లే సమయంలో పోలీసులు ఆపితే… వారి పరిస్థితి ఏంటి. పోలీసులు నచ్చజెప్పి.. డబ్బుతో బయటపడేసరికి తలప్రాణం తొక్కొస్తుంది.
ఇలాంటి అనుభవం ఇప్పటికే చాలా మందికి ఎదురైందట. దీంతో ఇదేం ఎన్నికల కోడ్, ఇవేం తిప్పలు అంటూ తలలు పట్టుకున్నారు పెళ్లింటి వారు. పోనీ, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకుందామా అంటే… ఎన్నికల కోడ్ ముగిసే సరికి.. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కోడ్ ముగిసే సమయానికి… శుభముహూర్తాలు కూడా అయిపోతాయట. ఇక చేసేది ఏమీ లేక… కోడ్ కష్టాలు అనుభవిస్తున్నారట.ఎన్నికల కోడ్ వల్ల.. శుభకార్యాలు పెట్టుకున్న వారికే కాదు… అత్యవసరం కోసం డబ్బులు అప్పుగా ఇచ్చేవారు కూడా… పోలీసుల తనిఖీల వల్ల వెనకడుగు వేస్తున్నారట. ఆ డబ్బు ఎక్కడిది అని పోలీసులు అడిగితే ఏం చెప్పాలో తెలియక.. అత్యవసరానికి అప్పు అడిగినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారట.
దీంతో సామాన్యులు ఇబ్బందులు పడక తప్పని పరస్థితి ఏర్పడింది. అత్యవసర ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్స్లో బిల్లులు చెల్లించేందుకు కూడా కొందరు కష్టాలు పడుతున్నారు. దాచుకున్న సోమ్ముకు ఆధారాలు ఎక్కడి నుంచి తేగలమని ప్రశ్నిస్తున్నారు.