తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రతి వేదికపై ప్రచారం చేస్తూ హడావుడి చేసిన కమలదళం.. సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి తటాపటాయిస్తోందనే చర్చ జరుగుతోంది. పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనంటూ ఆరు నెలలుగా హైకమాండ్ ప్రెషర్ పెడుతున్నా.. సీనియర్లలో కదలికే లేదని టాక్. సీనియర్లంతా తాము పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని చెబుతూ అసెంబ్లీ బరి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.బీజేపీ అభ్యర్ధుల జాబితా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కార్యకర్తలు తెగ ఎదురుచూశారు. మొత్తానికి 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. కానీ, ఆ లిస్టులో ఎక్కడా సీనియర్లు కనిపించలేదు. రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ మినహా. ఇక రెండో లిస్టులోనైనా సీనియర్లు ఉంటారనుకుంటే అందులోనూ కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.గెలిచేది తామేనంటారు, కానీ పోటీ చేయరు.
పోటీచేయాల్సిన వాళ్లు పార్టీలో ఉండరు, పార్టీలో ఉన్నవాళ్లు పోటీ చేయరు. ఈ రెండు స్టేట్‌మెంట్లు దాదాపు ఒకేలా ఉన్నా.. విడమరిచి చూస్తే ఒక్కో సెంటెన్స్‌లో చాలా అర్థం కనిపిస్తుంది. తెలంగాణలో అధికారం మాదే..! ఇప్పటికీ ఇదే మాట వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీ నేతల నుంచి.. కానీ, ఆ డైలాగులు ఎవరైతే చెబుతున్నారో, గెలుస్తామని ధీమాగా చెబుతున్నారో.. వాళ్లే పోటీకి దూరంగా ఉన్నారు. స్వయాన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే.. అసెంబ్లీకి పోటీ చేయను, లోక్‌సభ ఎన్నికలే నా టార్గెట్ అంటుంటే.. ఇక కింది స్థాయి నేతల పరిస్థితేంటీ..? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న.బీజేపీ గ్రాఫ్ పీక్స్‌లో ఉన్నప్పుడు.. సూపర్-30 మాదిరి ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు. ఆ జాబితాలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు, ఎంపీలుగా ఉన్న వాళ్లు, పబ్లిక్‌లో ఇమేజ్ ఉన్న వాళ్లు ఉంటారని చెప్పుకొచ్చారు పార్టీ ముఖ్యనేతలు. కిషన్‌రెడ్డితో సహా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లంతా పోటీ చేస్తారనే అనుకున్నారు. తీరా చూస్తే చాలామంది సీనియర్లు పోటీకి దూరంగా ఉన్నారు.
పైగా డైరెక్ట్ స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. తాము ఈసారి అసెంబ్లీకి పోటీ చేయడం లేదంటున్నారు..ఓవైపు నామినేషన్లకు అందరూ సిద్ధం అవుతుంటే.. టికెట్ ఇస్తాం రండి అని అధిష్టానం పిలుస్తుంటే.. ఈ సమయంలో పోటీకి దూరం అని స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఏంటి? పార్టీ ముఖ్యులకు తెలుస్తోందో లేదో గానీ తెలంగాణ సమాజానికి మాత్రం ఇది రాంగ్ సిగ్నల్ పంపుతోంది. బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, సోయం బాపూరావు వంటి వాళ్లు సైతం అయిష్టంగానే అసెంబ్లీ బరిలో దిగారనేది పార్టీలోని కొందరు చెబుతున్న మాట. ప్రస్తుతానికి నలుగురు ఎంపీల్లో ముగ్గురు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ లీడర్ విజయశాంతి.. వీళ్లందరూ ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఇదంతా చూస్తుంటే బీజేపీ సీనియర్ల అభిమతం ఎలా ఉందో గానీ.. ఇటు క్యాడర్‌లో, అటు ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోంది. పైగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే.. మళ్లీ వాళ్లనే పార్లమెంట్ బరిలో కూడా దింపుతారు. సో, రెండుసార్లు భారీగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు పోటీ చేయకపోవడానికి ఈ భయం కూడా ఓ కారణం అన్న చర్చ మొదలైంది.గద్వాల జేజమ్మ డీకే అరుణ తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. బీజేపీలోని మరో సీనియర్ నేత జితేందర్ రెడ్డి సైతం పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన బదులు తన కుమారుడికి బీఫామ్ ఇప్పించుకున్నారు. ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా లోక్‌సభకే పోటీ తప్పా.. అసెంబ్లీకి కాదంటున్నారు. ఎంపీ లక్ష్మణ్ తాను రాజ్యసభ సభ్యుడి అంటూ చెబుతున్నారు. మరో సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గవర్నర్ స్థానంలో పంపించారు. ఇక మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీచేస్తారని ప్రచారం జరిగిన రామచంద్రరావు.. వీళ్లంతా పోటీకి దూరంగానే ఉన్నారు.ఇలా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడాన్ని బీజేపీ అధిష్టానం ఏమనుకుంటోందో గానీ.. క్యాడర్ మాత్రం ఓటమిని ముందే అంగీకరించినట్లేనని ఫీల్ అవుతోంది. పైగా రోజుకో సీనియర్ లీడర్ వెళ్లిపోతున్నా, ఉన్న సీనియర్లు పోటీ చేయబోమని చెప్పేస్తున్నా జాతీయ నాయకత్వం లైట్ తీసుకోడాన్ని కూడా కొందరు సహించలేకపోతున్నారు.
ఇంతే స్తబ్దుగా ఉంటే మాత్రం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ ఉనికి కోల్పోయిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయాన్ని గట్టిగానే వినిపిస్తోంది.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్లు బీఆర్ఎస్‌ను ఓడించేది కాంగ్రెస్సేనంటూ వెళ్లిపోయారు. పార్టీలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లాంటి నేతలను నిలుపుకోలేకపోయారు. అంటే పోటీ చేస్తారనుకున్న వాళ్లు ఉండరు.. ఉన్నవాళ్లు పోటీ చేయరు. అటు హైకమాండ్ కూడా పోటీ చేయాల్సిందే అని గట్టిగా చెప్పదు. ఇలా అయితే ఇక బీజేపీకి మిగిలేదేంటి? బీజేపీలో మిగిలేదెవరు? కిషన్ రెడ్డి, డీకే అరుణ, విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, లక్ష్మణ్, రామచంద్రరావు.. వీళ్లని బరిలోకి దింపలేకపోవడం పార్టీకి కచ్చితంగా మైనస్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.మరోవైపు బీజేపీ అభ్యర్ధుల జాబితా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కార్యకర్తలు తెగ ఎదురుచూశారు. మొత్తానికి 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. కానీ, ఆ లిస్టులో ఎక్కడా సీనియర్లు కనిపించలేదు. రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ మినహా. ఇక రెండో లిస్టులోనైనా సీనియర్లు ఉంటారనుకుంటే అందులోనూ కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.
ఇదిలావుంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే లోక్‌సభ స్థానాల్లోనే గెలవాలి. అందుకే.. సీనియర్లను పక్కనపెడుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీలో జరిగిన అంతర్గత మీటింగ్‌లోనూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనే తాము పోటీ చేస్తామని సీనియర్లు చెప్పినందునే ఈ రెండు లిస్ట్‌లలో వాళ్ల పేర్లు లేవు అనే చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా జనంలో వినిస్తున్న టాక్ ఒక్కటే. సీనియర్లు పోటీకి దూరంగా ఉండడం అంటే దేర్ ఈజ్ సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.