ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారిన పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఈ ఎన్నికల్లో ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కంచుకోటగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పై పోటీకి ఓ ఎన్నారై రంగంలోకి దిగింది.
మొదట ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ పౌరసత్వ సమస్య కారణంగా ఆమె కోడలు యశస్విని రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించారు. అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న యశస్విని రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఎర్రబెల్లి రాజకీయ అనుభవంలో సగం వయసు కూడా లేని యువతి రాజకీయ ఆరంగేట్రం చేసి ఎర్రబెల్లికే సవాల్ విసురుతూ ఉండడంపై స్థానికంగా ఆసక్తికరచర్చ జరుగుతుంది.
ఇప్పటివరకు ఒకసారి ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ ఏడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఎన్నికల బరిలోకి నిలిచారు. ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సునాయాసంగా జరుగుతుంది అని భావిస్తే, ఎన్ఆర్ఐ యశస్వినీ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగడంతో అది కాస్త జటిలంగా మారింది.
పాలకుర్తి నియోజకవర్గంలోకి ఎంట్రీతోనే ఝాన్సీ రెడ్డి ఆమె కోడలు యశస్విని రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి గులాబీ మంత్రికి టెన్షన్ పుట్టించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పై విరుచుకుపడుతూ, తమకు అవకాశం ఇస్తే నిజమైన అభివృద్ధి ఏమిటో చూపిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పారాచ్యూట్ నేతలకు పాలకుర్తిలో స్థానం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు వారి మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్యర్ధులు ఎవరైనా సరే గెలుపు మాత్రం తనదేనని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంగబలం, అర్థబలం ఉన్న ఝాన్సీ రెడ్డి దూకుడు చూసి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రస్తుతం నియోజకవర్గంలో విరివిగా పర్యటిస్తూ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కూడా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి టెన్షన్ పట్టుకుంది.