తెలంగాణ రాజకీయం

బీజేపీ నాలుగో జాబితా రెడీ

ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 12మందితో నాలుగో జాబితా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు నిరాశ ఎదురైంది. వేముల వాడ నుంచి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు టికెట్ అశించి భంగపడ్డారు.

బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసింది బీజేపీ. 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. అంతకు ముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితా, 35 మందితో థర్డ్ లిస్టు విడుదల చేసింది. ఇక నాలుగో జాబితాలో 12 మందికి చోటు దక్కగా మొత్తం 100 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన 19 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఇక అభ్యర్థుల జాబితా విషయానికి వస్తే… చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా దుర్గం అశోక్‌ పేరును ఖరారు చేసింది. ఎల్లారెడ్డి స్థానం నుంచి సుభాష్‌రెడ్డి, వేములవాడ నియోజకవర్గానికి గానూ ఈటెల రాజేందర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ వైపు మొగ్గు చూపింది పార్టీ అధిష్టానం. ఇక్కడ టికెట్ ఆశించిన వికాస్ రావుకు నిరాశ తప్పలేదు. ఇక, హుస్నాబాద్‌ స్థానానికి శ్రీరామ్‌ చక్రవర్తి, సిద్దిపేట బరిలో శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్‌ నుంచి నవీన్‌కుమార్‌, కొడంగల్‌ – రమేష్‌కుమార్‌, గద్వాలలో బోయ శివ, మిర్యాలగూడ అభ్యర్థిగా సాదినేని శ్రీనివాస్‌ ఖరారు అయ్యారు.

ఇక అనుహ్యంగా మునుగోడు నియోజకవర్గం నుంచి ఇటీవలె కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరిన చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ దక్కించుకున్నారు. నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి మొగలయ్య, ములుగు స్థానంలో అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌‌ లను అభ్యర్థులుగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇక అనుకున్నట్లుగానే శేరి లింగంపల్లి అభ్యర్థిని పేరులో పెండింగ్‌లో పెట్టింది బీజేపీ.బీజేపీ-జనసేన పొత్తు నేపథ్యంలో ఇప్పటికే 8 చోట్ల సీట్ల సర్దుబాటు కుదిరింది. కానీ శేరిలింగంపల్లి విషయంలో జనసేన గట్టిగా పట్టుబడుతోంది. అదే టికెట్‌ తన అనుచరుడికి ఇప్పించుకునేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రవికుమార్‌ కోసం లాబీయింగ్ చేస్తుంటే.. యోగానంద్‌ కూడా తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు రెబల్‌గా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేనకే ఈ సీటు కేటాయిస్తే ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.