కర్నూలు జిల్లాలో గత రెండు రోజులు పాటు కురిసిన వర్షాలు చిన్న పంటలకు ప్రాణం పోశాయి. పూర్తిగా ఎండిపోతున్న దశలో కొన్నిచోట్ల సాధారణ, మరికొన్నిచోట్ల కురిసిన భారీ వర్షం ప్రాణం పోసినట్లుంది. పప్పు శనగ, ధనియాలు, కంది లాంటి చిన్న పంటలను కురిసిన చిన్నపాటి వర్షం ఆదుకున్నట్లయినది. ఎవరూ ఊహించని విధంగా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల రికార్డు స్థాయిలో కుంభ వర్షం కురిసింది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్ర వర్ష భావ పరిస్థితులు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. తాగడానికి నీళ్లు కూడా లేనంత కష్టంగా మారింది. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో తాగునీటి బోర్లు , డ్రింకింగ్ వాటర్ స్కీములు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో శనివారం రాత్రి, ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం కురిసి అందరిని ఆశ్చర్యపరిచిందికర్నూలు నగరంతో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టుండి కుండపోత వర్షం వచ్చింది. దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా 120 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కల్లూరు అర్బన్ లో 120 మిల్లీమీటర్లు, కర్నూలు నగరంలో 98 మిల్లీమీటర్లు, కర్నూల్ రూరల్ 58 మిల్లీమీటర్లు, క్రిష్ణగిరి 25 మిల్లీమీటర్లు, తుగ్గలి 17 మిల్లీమీటర్లు, చిప్పగిరి 13 మిల్లీమీటర్లు, మద్దికేర 11మిల్లీమీటర్లు, ఓర్వకల్ మండలంలో ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మొత్తానికి కర్నూలు జిల్లాలో సగటున 13.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందిహలహరి వి, హొలగొంద మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో చినుకు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ వర్షం పరిమితం కావడం పట్ల మిగిలిన ప్రాంతం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నట్లుండి కురిసిన వర్షం శనగ, ధనియాలు, జొన్న, కంది వంటి పంటలకు ఊపిరి పోసింది. గ్రామీణ ప్రాంతాల్లో పడాల్సిన భారీ వర్షం కేవలం కర్నూలు అర్బన్ కి పరిమితం కావడంతో వ్యవసాయానికి పనికి రాలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ చెబుతూ ఉండటంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కనీసం ఈ నెలలోనైనా వర్షాలు కురవాలని తాగునీటికీ పంటలకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరుకుంటున్నారు