తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీప్ ఫేక్ టెక్నాలజీ ఆందోళన కలిగిస్తోంది. ఫేక్ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని నాయకులు భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రష్మిక మందన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది తన వీడియో కాదని ఫేక్ వీడియో అని స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జరా పటేల్ ను రష్మిక ముఖంతో రీప్లేస్ చేశారని తెలిసింది. తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఈ టెక్నాలజీ బారిన పడ్డారు. ప్రముఖ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడి డీప్‌ఫేక్ పరువు నష్టం కలిగించే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ నాయకుడు, మంత్రి మల్లా రెడ్డి డీప్‌ఫేక్ AI రూపొందించిన వీడియోలో డ్యాన్స్ చేస్తూ, రాబోయే తెలంగాణా ఎన్నికలు 2023లో “కేసీఆర్‌కి ఓటు వేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి” అని చెప్పడం చూడొచ్చు.
కొన్ని పార్టీలు మిమిక్రీ అర్టిస్టులను నియమించుకుని ఫేక్ వీడియోలు రూపొందించే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలన్ని నిజం కాదు.. గుర్తుంచుకోవాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలు ఎన్నికల వరకే పరిమితం కావని హెచ్చరించారు. భవిష్యత్ లో సెలబ్రిటిలపై ఫేక్ వీడియోలు సృష్టించి సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఫేక్ వీడియోల పట్ల పార్టీ శ్రేణులను ప్రధాన పార్టీలు అలర్ట్ చేశాయి. ఫేక్ వీడియో లాగా అనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరిటనట్లు తెలుస్తోంది.