ఈ నెలలోనే జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ నేతలు భారీగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, క్షేత్ర పరిశీలకులను నియమించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను పెంచుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు నియమితులైన కర్ణాటక నేతలందరూ నవంబర్ 4వ తేదీ శనివారం ఈ ఎన్నికల రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన 10 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు కర్ణాటకకు చెందిన మంత్రులే కావడం విశేషం. 48 మంది నియోజకవర్గ పరిశీలకుల్లో 34 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
మిగిలిన వారిలో మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరుగులేని విజయానికి దారితీసిన జట్టులో వీరందరూ భాగమైనందుకు వీరంతా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ నాయకులకు ముఖ్యమైన పదవులు వరించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 10 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు, ఐటీ, బీటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్, వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప నియమితులయ్యారు. రెవెన్యూ శాఖా మంత్రి కృష్ణ బైరే గౌడ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, కన్నడ, సాంస్కృతిక సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ ఎస్ తంగడగి, గృహనిర్మాణ శాఖ మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ తెలంగాణలో మకాం వేశారు.
కర్ణాటక అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే, యువజన, క్రీడల శాఖా మంత్రి, బళ్లారి మాస్ లీడర్ బి. నాగేంద్రతో సహ 48 మంది క్షేత్ర పరిశీలకులు తెలంగాణలో ప్రత్యేక విభాగాలపై దృష్టి సారించి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో 13 మంది షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), నాలుగురు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)కి, మిగిలిన 31 మంది నియోజకవర్గాలు సాధారణ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ కోసం ఎన్నికల వ్యూహకర్త సునీల్ నేతృత్వంలోని బృందం పనిచేస్తోంది. తెలంగాణలో రాజకీయ పరిశీలకుడిని నియమించడం ఇదే తొలిసారి. ఇది ఎన్నికల ప్రక్రియలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను సులభతరం చేయడం, వారు విజయం సాధించడం టార్గెట్ గా పెట్టుకున్నారని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అంటున్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించడం, అవసరమైన సధుపాయాలు కల్పించి సమర్థవంతంగా ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ నాయకుడు చెప్పారు. మొత్తం మీద కర్ణాటకలో తెలుగు మాట్లాడే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణకు వెళ్లి వాళ్లకు అప్పగించిన నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు