ఓవైపు అధికార పార్టీ జెట్ స్పీడ్‌లో వెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం జనంలో కనిపించడం లేదు అన్న విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఇంతకీ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే? సింపుల్.. ఈ నాలుగున్నరేళ్ల జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోభివృద్ధిని అందరికీ వివరంగా చెప్పడమే. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక కోటి 60 లక్షల కుటుంబాల్లో దాదాపు కోటి 40 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందాయని చెబుతోంది సర్కార్.అలా లబ్ది పొందిన వారి దగ్గరకి వెళ్లడమే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఉద్దేశం. ప్రతీ ఇంటికి వెళ్లి, ప్రతి పౌరుడిని కలిసి, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాళ్లకి చేకూరిన లబ్ధిని వారికే వివరిస్తారు. పల్లె ప్రజలకు ఏమేం పథకాలు తెచ్చారు, ఎంతమంది లాభపడ్డారో ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా వివరిస్తున్నారు కూడా. అలాగే పట్టణాలు, నగరాలలో ఏయే పథకాల ద్వారా ఎంత మంది లబ్ధి పొందారనే వివరాలను ప్రజల ముందు పెడుతున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సంక్షేమ అభివృద్ధి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో రోజుకు 15 ఇళ్ల చొప్పున సందర్శించి జగన్ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరింది, ఆ గ్రామానికి ఎంత మేలు జరిగిందో లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో ఐదు రోజులు, వార్డు సచివాలయం పరిధిలో ఏడు రోజుల పాటు నడుస్తుంది. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా 24 పేజీలతో ఓ బుక్‌లెట్ తయారుచేయించారు. ఇందులో ఒక్కో కుటుంబానికి అందిన పథకాలు, వాటి వల్ల జరిగిన లబ్ది వంటి వివరాలున్నాయి. ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని నమ్మితే.. తనకు మద్దతుగా నిలవాలని చెబుతున్నారు జగన్. ఈ బుక్‌లెట్‌లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ఉన్నాయి. వీటిని వాలంటీర్లు ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. వీటితో పాటు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, ఇంటింటి ప్రచారాలు, రాష్ట్రవ్యాప్తంగా చర్చా వేదికలు ఇప్పటికే మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలుపై ప్రజాతీర్పు పేరుతో కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి.
సచివాలయాల వద్ద రియల్ డెవలప్‌మెంట్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు దాదాపు 99.5 శాతం హామీలు పూర్తి చేశామని గడపగడపకు వెళ్లి చెబుతున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 19 వరకు గ్రామగ్రామాన జరుగుతుంది.ఓ వైపు సంక్షేమ పథకాల గురించి చెబుతూ.. ఏపీ అభివృద్ధిపైనా ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. జీఎస్‌డీపీలో.. ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరడం, తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉండడం, రాష్ట్రంలో 4 లక్షల 93 వేల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనంత సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసిందని నమ్ముతోంది జగన్ ప్రభుత్వం. చేసిన మంచిని ప్రజలకు వివరించేందుకు సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టింది. ఈ సామాజిక బస్సు యాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా డిసెంబర్ చివరి వరకు ఈ యాత్ర జరిగేలా షెడ్యూల్ చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు రాజకీయంగా పదవులు కట్టబెట్టడం నుంచి అందిన సంక్షేమ పథకాల వరకు అన్నిటినీ లీడర్లు వివరిస్తున్నారు.
ప్రతిరోజూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు పెడుతున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు.ఇక జగనన్న సురక్ష పేరుతో ప్రతి గడపకు వెళ్తోంది ప్రభుత్వం. కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉంటే.. వారికి నయం అయ్యేంత వరకూ చేదోడుగా ఉండడమే జగనన్న సురక్ష కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్లు ప్రజల దగ్గరికే వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి.. పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఏఎన్‌ఎంలు, రీజనల్ మెడికల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. మరోవైపు, ఆరోగ్య శిబిరాలను కూడా స్టార్ట్ చేశారు. ఈ శిబిరాలకు వచ్చిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి, మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో భాగంగా బీపీ, షుగర్, మూత్ర, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగ్యూ, కఫం వంటి ఏడు రకాల పరీక్షలను ఉచితంగానే చేస్తున్నారు. సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో.. ఒక కోటి 44 లక్షల కుటుంబాల్లోని వారికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. అంటే.. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తైంది. ఆరున్నర కోట్ల ర్యాపిడ్ పరీక్షలు చేశారు.కార్యక్రమం ఏదైనా సరే.. జనం మధ్యలోకి వెళ్లడం, ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల్లోనే ఉండేలా చేయడమే వీటి అసలు ఉద్దేశం. ఈ పని విజయవంతంగా నిర్వహిస్తున్నారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో మొదలుపెట్టి.. బస్సు యాత్ర మీదుగా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం వరకు వచ్చారు. ఈ టెంపో అక్కడితోనే ఆగదు. జనవరి నుంచి పథకాలకు నిధులు మంజూరు చేసే కార్యక్రమం జోరుగా సాగబోతోంది.
అంటే.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తరువాత.. అప్పుడు మేనిఫెస్టో తీసుకొస్తారు. ఆ తరువాత నుంచి కొత్త మేనిఫెస్టో ప్రచారం మొదలవుతుంది. మొత్తంగా.. ఎన్నికల వరకు పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తోంది వైసీపీ. మరి ప్రతిపక్షాలు అధికార పార్టీ స్పీడ్‌ను ఎంత వరకు అందుకుంటాయో చూడాలి.