ఎన్నికలకు ప్రణాళికలు, ప్రచారం, మేనిఫెస్టో రూపకల్పన, అభ్యర్థులను ఖరారు చేయడం ఒక ఎత్తు. ఎలక్షనీరింగ్ చేయడం మరో ఎత్తు. పోలింగ్ డేట్‌కు ముందు ఉండే రెండు రోజులు చాలా కీలకం. బూత్‌లలో.. కౌంటింగ్ సెంటర్లల్లో పార్టీ కేడర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ రెండు రోజులు ఓటర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పోలింగ్ బూత్‌లలో దొంగ ఓటర్లను కనిపెట్టేందుకు ఏజెంట్లు ఉండాలి. ఇదంతా జరగాలంటే… కార్యకర్తలతో ఒక వ్యవస్థను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఎలక్షనీరింగ్‌లో అనుభవం ఉన్న కేడర్ అవసరం ఎంతో ఉంటుంది. ప్రజల్లో తమ పార్టీపై సానుభూతి ఉన్నా.. ప్రత్యర్ధి పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా.. ఎలక్షనీరింగ్ సరిగా చేసుకోలేకపోతే నానా తంటాలు పడాల్సి వస్తుంది. అలాంటి కేడర్ మీద ఇప్పుడు వరుస కేసులు బుక్ అవడం టీడీపీని కలవరపెడుతోందట. పార్టీ ముఖ్య నేతల మీదే కాకుండా.. క్షేత్ర స్థాయిలో టీడీపీ కేడర్ మీద కూడా విపరీతంగా కేసులు నమోదయ్యాయన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన ఫీడ్ బ్యాక్ అట.
నాలుగున్నరేళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల పేరుతోనో, లేక మరో రకంగానో మొత్తం 175 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి కేడర్‌పై భారీ సంఖ్యలో కేసులు ఉన్నాయట. చిన్న చిన్న అంశాల మీద కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ చాలా కాలం నుంచి విమర్శలు చేస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మొత్తంగా ఎన్ని కేసులు ఉన్నాయనే సమాచారాన్ని టీడీపీ అధిష్టానం సేకరించిందట. ఆ ఫిగర్ చూసి పార్టీ పెద్దలకు కళ్ళు బైర్లు కమ్మినట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ మీద దాదాపు 60 వేల కేసులు ఉన్నట్టు తేలిందట. వీళ్లల్లో చాలా మంది క్షేత్ర స్థాయిలో పార్టీకి సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించేవారే ఉన్నారు. ఎలక్షనీరింగ్‌లో చురుగ్గా ఉండేవారి పైనే ఎక్కువగా కేసులు పెట్టారంటోంది టీడీపీ. ఎన్నికల్లో పైస్థాయి నేతలనే కాకుండా.. క్షేత్ర స్థాయిలో కేడర్‌ను కూడా టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం ఓ వ్యూహం ప్రకారం కీలకమైన వారి మీద ఏదో ఒక కేసు పెడుతోందన్నది టీడీపీ అభియోగం. ఆ కేసుల పేరుతో పోలింగ్‌కు ముందు వాళ్ళందర్నీ కట్టడి చేస్తే… తమ పని తేలిక అవుతుందన్నది వైసీపీ వ్యూహంగా అనుమానిస్తున్నారు టీడీపీ ముఖ్యులు.
ఈ పరిస్థితుల్లో ఈ కేసుల నుంచి కేడర్‌కు ఎలా విముక్తి కలిగించాలనే అంశంపై కిందా మీదా పడుతోందట సైకిల్ పార్టీ నాయకత్వం. ఎన్నికల నాటికి ఈ కేసుల నుంచి కేడర్‌కు విముక్తి కలిగించకుంటే.. ఇబ్బంది వస్తుందన్న ఆందోళన పెరుగుతోందట.అసలు 60 వేల కేసుల మీద న్యాయపోరాటం చేయడం ఎలాగంటూ… లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదిస్తోందట. ఇదే అంశంపై టీడీపీ-జనసేన జేఏసీ సమావేశంలో కీలక చర్చ జరిగింది. టీడీపీతో పాటు కొన్ని చోట్ల జనసేన కేడర్ మీద కూడా ఇదే తరహాలో కేసులు పెట్టారనే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. న్యాయ పోరాటం చేయాలనే అభిప్రాయానికి వచ్చాయట రెండు పార్టీలు. అయితే అన్ని కేసుల మీద న్యాయపోరాటం అంత తేలికైన విషయం కాదంటున్నారు. దీంతో ఎలక్షన్ టైంకి వ్యవహారం కొలిక్కి రాని పక్షంలో ఎలక్షనీరింగ్‌కు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని పైనా ఇప్పటి నుంచే కసరత్తు చేసుకుంటే బెటరన్న సూచనలు వస్తున్నాయట పార్టీ అధినాయకత్వానికి.