కరోనా వేళ భారత్‌లో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత.. యాంటీబయాటిక్స్ మందుల అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు స్టడీలో తెలిపారు. స్వల్ప, మధ్య స్థాయిలో కరోనా వచ్చిన వారికి చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ మందుల్ని అమ్మినట్లు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ స్టడీ చేశారు. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇండియాలో సుమారు 21.6 కోట్ల డోసుల యాంటీబయాటిక్స్ వాడినట్లు నిర్ధారించారు. వీటికి తోడు అదనంగా మరో 3.8 కోట్ల డోసులు అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు విచ్చలవిడిగా అమ్ముడుపోయినట్లు స్టడీలో గుర్తించారు.
భారీ స్థాయిలో యాంటీబయోటిక్స్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆ అధ్యయనం నిర్వహించిన సీనియర్ రచయిత సుమంత్ గంద్రా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు యాంటీబయాటిక్స్ వల్ల పెను ప్రమాదం ఉందన్నారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల .. మందులకు తగ్గే ఇన్‌ఫెక్షన్లు త్వరగా నయం కావన్నారు. అమెరికాలోని బర్నేస్-జువిష్ హాస్పిటల్‌లో సుమంత్ అసోసియేట్‌గా చేస్తున్నారు. వ్యాధి నిరోధక మందులను అతిగా వాడడం వల్ల సాధారణ న్యూమోనియా లాంటి వ్యాధుల్ని ట్రీట్ చేయడం ఇబ్బందిగా మారుతుందని సుమంత్ తెలిపారు. దీంతో పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నారు.