ys sharmila
తెలంగాణ రాజకీయం

అయ్యో.. షర్మిళ…

ఆవేశం, తొందరపాటుతనం, అనాలోచితన నిర్ణయాలు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులకు కారణమయ్యాయని చర్చ జరుగుతోంది.వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ఎవరు అడగకపోయినా ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. వామపక్షాలతో చివరి నిమిషం వరకు చర్చల కోసం ప్రయత్నించిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు షర్మిల మద్దతిస్తున్నట్లు ప్రకటించినా పెద్దగా స్పందించ లేదు.షర్మిల నిర్ణయం రెండేళ్లుగా ఆమెతో కలిసి నడిచిన ఎంతోమందిని కష్టపెట్టింది. ఇన్నాళ్లు తమ శ్రమ, కష్టం బూడిదలో పోసినట్టైందని శాపనార్థాలు కూడా పెట్టారు. ఎన్నికల్లో పోటీపై గంపెడాశలు పెట్టుకున్న వారిని నిరుత్సాహానికి గురి చేసింది.వైఎస్‌ షర్మిల రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారనే విషయం ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కదు. ఎంతో ప్రేమించి, అభిమానించే అన్న నిర్ణయాన్ని కాదని మొండిగా తెలంగాణలో రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కునేందుకు ఆమె ఎందుకు సిద్ధపడిందనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకోక ముందు జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను నిలిపి వేయాలని సోనియా ఆదేశించినపుడు ఆమె ఎదుట షర్మిల ధిక్కార స్వరం వినిపించినట్టు సన్నిహితులు చెబుతారు.తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలనే నిర్ణయం వెనుక షర్మిల ప్రోద్భలం కూడా ఉందని సన్నిహితులు చెబుతారు. జగన్మోహన్ రెడ్డితో అంతటి చనువు, సాన్నిహిత్యం ఉన్న షర్మిల..ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు దూరమైపోయిందనేది ఎవరికి అంతు చిక్కదు.షర్మిల రాజకీయాల్లోకి రావడాన్ని జగన్ ఎందుకు స్వాగతించలేదనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం షర్మిల రాజకీయ ప్రవేశంపై జగన్‌కు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా ఆమె భర్త వ్యవహార శైలిపై జగన్‌కు అభ్యంతరాలు ఉన్నట్లు చెబుతారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే షర్మిల భర్త, మత ప్రచారకుడు అనిల్‌కు ప్రాధాన్యత ఇస్తే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయని సందేహించినట్టు చెబుతారు.

అధికారంలో వచ్చిన తొలినాళ్లలో జగన్‌ ఎదుర్కొన్న క్రైస్తవ ముద్రను తొలగించుకోడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఏపీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనికి తోడు ఆస్తుల వ్యవహారంలో చాలా వరకు ఈడీ కేసుల్లో చిక్కుకుని ఉండటం కూడా ఇద్దరి మధ్య దూరం పెంచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్‌కు సంబంధించిన వ్యాపారాల్లో అడుగు పెట్టేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడంతో అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో పదేళ్ల పాటు అన్నకు అండగా ఉన్న తనకు కూడా రాజకీయ భవిష్యత్తును షర్మిల కోరుకోవడం,తగిన సమయం వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పడం షర్మిలకు రుచించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సొంతంగా రాజకీయ భవిష్యత్తు వెదుక్కునే ప్రయత్నాలు తెలిసి.. వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉండే సొంత సామాజిక వర్గ నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

వారంతా జగన్ ప్రోద్భలంతోనే వెనక్కి లాగుతున్నారని భావించి మరింత దూకుడుగా ప్రవర్తించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.రాజకీయ పార్టీని పెట్టేందుకు రెండేళ్ల క్రితం బెంగుళూరులో ఉన్న ఆస్తుల్ని కూడా విక్రయించినట్టు తెలుస్తోంది. రెండే‌ళ్లలో పార్టీ నిర్వహణ కోసం కోట్లాది రుపాయలు ఖర్చు చేసినా తగిన ఫలితం మాత్రం దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ఆర్ధికంగా కూడా పరిస్థితులు సహకరించక పోవడంతో పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.అదే సమయంలో షర్మిలను చేర్చుకుంటే ఆంధ్రా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఆలోచనకు కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గాల్సి వచ్చింది. అందుకే గడువులు పొడిగించినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు.కాంగ్రెస్ పార్టీ పిలిచి చివరి నిమిషం వరకు ఎటూ తేల్చకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించినా ఆ తర్వాత వెనక్కి తగ్గక తప్పలేదు.

ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే సూచనలు, సలహాలతో కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయకూడదని భావించి పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.బాహాటంగా కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు ఇచ్చినా కనీసం కృతజ్ఞతలు కూడా ఆమెకు దక్కలేదు. అన్నతో బెట్టు చేయకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునే ఉంటే షర్మిలకు తెలంగాణలో ఇలాంటి అవమానం జరిగేది కాదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది రోజులు వేచి ఉంటే షర్మిలకు ఖచ్చితంగా ఏపీలోనే రాజకీయ భవిష్యత్తు దక్కి ఉండేదని, షర్మిల ఎదుర్కొంటున్న పరిస్థితి తమను కూడా బాధిస్తుందని, ఆవేశం, తొందరపాటు తనమే ఈ పరిణామాలకు కారణమని చెబుతున్నారు.