bjp
తెలంగాణ రాజకీయం

బీజేపీకి మాదిగల వర్గీకరణ ఎఫెక్ట్…

ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి కొన్ని కులాలు, తెగలను తొలగించాలనేది వివాదంగానే ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేక రకాల సిఫారసులు, జడ్జిమెంట్లు వెలువడ్డాయి. పార్లమెంటు ద్వారా రాజ్యాంగంగంలోని ఆర్టికల్ 341కు సవరణ జరిగితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయి. మరోవైపు రాష్ట్రాలకు ఉన్న కొన్ని విచక్షణాధికారాలను వినియోగించుకుని అమలు చేయవచ్చంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతోపాటు విపక్షాలు సైతం ఎన్నికల సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. బీజేపీ తన 2014 మేనిఫెస్టోలోనే వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించింది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అఖిలపక్షాన్ని, ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం తీర్మానం చేసి పంపింది.

దళితుల్లో సబ్ గ్రూపులుగా ఉన్న కులాలకు రిజర్వేషన్ల ప్రయోజనాలపై 1965 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం అప్పటి సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీఎన్ లోకూర్ అధ్యక్షతన అడ్వయిజరీ కమిటీని నియమించింది. మూడునెలల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్న కొన్ని కులాలు, తెగలు సాంఘికంగా, ఆర్థికంగా బలపడినందున రిజర్వేషన్ సహా పలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు ఆయా సంఘాల నుంచి కమిటీకి రాతపూర్వకంగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాలలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్ వచ్చింది. అప్పటి ఎంపీహెచ్‌సీ హెడా సైతం మాల కులాన్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని కమిటీకి వివరించారు. దీనికి కమిటీ నిరాకరించడంతో పలు కారణాలను ఆగస్టు 25, 1965న సమర్పించిన నివేదికలో వివరించింది.హక్కుల సాధన కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో 1994 జూలై 7న మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘం ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించింది.

మాదిగలకు సైతం రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత లభించాలన్న ఏకైక లక్ష్యంతో ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంది. జనాభా రీత్యా ఈ సెక్షన్‌ను దూరం చేసుకోకుండా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌లో గాంధీ భవన్ కొంత కాలంపాటు మాదిగల దీక్షలకు నిలయంగా మారింది. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాలన్న ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గాంధీ భవన్‌ను ముట్టడించి పెట్రోలు బాంబులు విసరడంతో సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారితో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పలువురు చనిపోయారు.ఎస్సీలకు రాజ్యాంగం ద్వారా అందుతున్న రిజర్వేషన్ ఫలాలు ఉప కులాలకు లబ్ధి చేకూరేలా అధ్యయనం చేయాల్సిందిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జస్టిస్ పి.రామచంద్రరాజు అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. లోతుగా అధ్యయనం చేసిన కమిషన్.. చివరకు తన నివేదికలో నాలుగు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫారసు చేసింది.

సమాజంలోని ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం, జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ సిఫారసులకు అనుగుణంగా 2000-2004 మధ్యకాలంలో వీటి అమలుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా మాలలు కౌంటర్ ఆందోళనను మొదలుపెట్టడంతో ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. చివరకు ఇది సుప్రీంకోర్టుకు చేరింది. ఎస్సీ వర్గీకరణ విధానాలను అమలుచేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగ సవరణలు జరిగిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుందంటూ స్పష్టత ఇచ్చింది.అయితే ఇన్ని అసమానతలు ఉన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తేనె తుట్టని ఇప్పుడు బీజేపీ మళ్లీ తెరపై తీసుకొచ్చింది.. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అస్త్రశస్త్రాలను ఒడ్డుతోంది.
బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ ఇప్పుడు దళిత సమాజాన్ని కూడా దగ్గర చేసుకునే పనిలో భాగంగా పెద్ద నిర్ణయం తీసుకుంది. అసలు బీజేపీకి అగ్రకుల పార్టీగా చాలా రోజుల నుంచి కూడా ఒక పేరు ఉంది. మనువాద పార్టీగా పేరొందిన బీజేపీ ఆ ముద్రను తొలగించుకునేందుకును ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆ సమాజాన్ని దగ్గర చేసుకోవాలనుకుంటోంది.

తెలంగాణ విషయంలో కచ్చితంగా వర్కౌట్ అవుతుందని భావిస్తోంది. బీజేపీ ఆంధ్రాలో ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి నష్టం జరిగినా తెలంగాణలో ఇదే అంశాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది.తెలంగాణలో ఉన్న 18 శాతం ఎస్సీలలో 70 శాతం మంది sc ఉప కులాలు ఉన్నాయి. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా పూర్తిస్థాయిలో ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవచ్చన్న భావన బీజేపీలో ఉంది. అందుకే ఈ స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అటు విపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే దీనిపైన వ్యక్తం అవుతుంది. ఇన్ని రోజులు అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదని మళ్లీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. కానీ పసుపు బోర్డు ఇతర అంశాల విషయంలో ప్రధాని చెప్పిన తర్వాత ఆ నిర్ణయాలు జరిగిపోయాయి కాబట్టి కచ్చితంగా ఈ విషయం పై కూడా ప్రధాని మాట్లాడిన తర్వాత దళిత సమాజంలోకి వెళ్లింది. మరి ఇది ఓటుగా మారడానికి ఎంతలా ఉపయోగపడుతుంది.? బీజేపీ విజయానికి ఎంతలా తోడ్పడుతుంది.? అనేది వేచి చూడాలి.