ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు తోడు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన విజయవాడ లోక్ సభ స్థానం కోసం తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో బలపడుతుందగా, కాంగ్రెస్ పార్టీ సైతం విజయవాడ లోక్ సభపై కన్నేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు వైఎస్ షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో పూర్వ వైభవం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ విజయం సాదించాలని చూస్తుంది. ఇక ఈ సారి విజయవాడ లోక్ సభ స్థానం పైన ఆసక్తి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి.
వైసీపీ నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్ధి కూడా టీడీపీ ఆశావాహుల జాబితాలో చేరిపోయారు. వైసీపీ కొత్త లెక్కలు తెర మీదకు తెస్తోంది. దీంతో, కీలకమైన విజయవాడ లోక్ సభలో బరిలో నిలచేదెవరనేది ఉత్కంఠ పెంచుతోంది.బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ యుద్ధ వాతావరణాన్నే తలపిస్తుంటాయి. రాజకీయం పుట్టిందే విజయవాడలోనా అన్నట్లు ఉంటాయి. మలుపుల మీద మలుపు, షాకుల మీద షాకులు ఉండేదే విజయవాడ రాజకీయం. అధికార పక్షం, విపక్షం అని రాజకీయం ఎక్కడైనా రెండువైపుల ఉంటుంది. బెజవాడలో అలాంటి లెక్కలు ఉండవు. అలాంటి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. రాజకీయం రగులుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే కనిపిస్తోంది. ఇక సందిట్లో సడేమియాలా దూసుకు వస్తోంది కాంగ్రెస్ పార్టీ.మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో పోటీ పెరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో నడుస్తున్న నేతలు పార్టీ టికెట్ రేసులో ముందున్నారు.
ప్రధానంగా కాపు వర్గానికి చెందిన నరహరిశెట్టి నరసింహారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజలకు దగ్గర ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న పేరుంది. కార్మికుల వెంట ఉండే సీనియర్ నాయకులు, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి,15వేల ఓట్ల తేడాతో వైసీపీ పార్టీ చెందిన పీవీపీ వర ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక ఈసారి కూడా తనకే టికెట్ దక్కుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇక ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు కమ్మ వర్గానికి చెందిన సుంకర పద్మ శ్రీ. ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యహరిస్తూ కార్మికుడి కష్టాన్ని గుర్తించి ప్రజల వెంట ఉంటున్నారు. రాజధాని రైతులకు తోడుగా, అంగన్వాడీ, మున్సిపల్ కార్మిక సంఘాల సమ్మెలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహిళా సీనియర్ నాయకురాలుగా పేరు సంపాదించారు. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు పద్మశ్రీ.గత 15 సంవత్సరాలుగా విజయవాడ లోక్ సభ స్థానాన్ని కమ్మ వర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు భర్తీ చేస్తున్నారు.
అయితే, విజయవాడ రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే బాటలో నడుస్తుందా అన్న చర్చ మొదలవుతోంది. వచ్చే లోక్ సభ స్థానానికి కమ్మ వర్గానికి చెందిన సుంకర పద్మ శ్రీను నిలపెడతారా..? లేదంటే అధిక ఓటర్లు కలిగిన కాపు వర్గానికి చెందిన సీనియర్ నాయకులు నరహరిశెట్టి నరసింహారావుకు టికెట్ కేటాయిస్తారా..? కాంగ్రెస్ అధిష్టానం చూపు ఎవరి వైపు..? అన్నదీ ఆసక్తికరంగా మారింది.