ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అంబర్‌పేట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగ్ అంబర్‌పేట్‌లోని బూర్జు గల్లి, దోబి గల్లి, పోచమ్మ బస్తి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రచారంలో బస్తీ వాసులు గులాబీ పూలతో పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబర్‌పేట్‌లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాలేరు వెంకటేష్ అన్నారు. అయితే, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. దీంతో ఈ మరోసారి అంబర్ పేటలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకుల మధ్య విమర్శల దాడి మరింతగా పెరుగుతుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై విమర్శలు చేయడానికి మీకు ఏమీ లేదు.. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడులు చేస్తున్నారని ఓవైసీ వ్యాఖ్యనించారు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారు అంటూ ఎంఐఎం చీఫ్ తెలిపారు. నీవు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి.. ఇందులో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓవైసీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షా సన్నిహితుడికి ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. దీనిపై దర్గా దగ్గరికి రమ్మన్నా.. భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరకి రమ్మన్నా వస్తాను.. మరి మసీదులో ప్రమాణం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ రెడీనా అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన ఒంటిపై షెర్వాణీ ఫైజామా ఉందని అనుకున్నా.. కానీ షెర్వాణీ కింద ఖాకీ నిక్కర్ కూడా ఉందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.ఇక, రేవంత్ రెడ్డి కామెంట్స్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడిగా చడ్డీ కట్టుకుని ఏబీవీపీకి వెళ్లి.. అక్కడి నుంచి టీడీపీలోకి.. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటూ ఓవైసీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గాంధీ భవన్‌ను మోహన్ భగవత్ స్వాధీనం చేసుకున్నారు.. ఆయన ఎలా కావాలంటే అలా కాంగ్రెస్‌ను నడిపిస్తారని ఎవరో సరిగ్గా చెప్పారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఓవైసీ షేర్వానీ గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ కూడా అదే పని చేశారని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.