ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంక్షోభం రాజుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని వ్యతిరేకించేవారు ఇంత కాలం సైలెంట్ గా ఉండేవారు. ఇటీవలి కాలంలో ఆమె పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తూండటంతో వారు ఇక స్వేచ్చ వచ్చిందని మరిన్ని విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాయలసీమకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి అనే నేత చేసిన ఆరోపణలు బీజేపీలో సంచలనం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షురాలుగా టీడీపీ కోసం పని చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు.ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సోము వీర్రాజును హఠాత్తుగా తప్పించిన తర్వాత పార్టీ హైకమాండ్ దగ్గుబాటి పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించింది. ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త కార్యవర్గాన్ని నియమించారు. జిల్లాల అధ్యక్షులు సహా అధికార ప్రతినిధులు అందర్నీ మార్చేశారు. అప్పట్నుంచి పార్ట స్తబ్దుగా మారిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీలో ముందుగా ఉన్న సీనియర్ నేతలందరూ సైలెంట్ అయిపోయారు.
పురందేశ్వరి ఏకపక్ష తీరును జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా.. కష్టపడుతూ వస్తున్న వారందరూ ఇప్పుడు పార్టీ అంశాలపై ఏమి చేయాలని అంతర్గత చర్చలు జరుపుతున్నారు. సీనియర్లు ఇప్పుడు ఆమె వ్వహరసైలిపై నోరెత్తలేకపోతున్నారు. గతంలో గట్టిగా తమ పార్టీ వాయిస్ వినిపించేవారంతా మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు , విష్ణువర్ధన్ రెడ్డి , మాధవ్ వంటి నేతలు ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణలో ఎన్నికల బాధ్యతలివ్వడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ రాజకీయాల కన్నా తెలంగాణలో ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అందర్నీ కలుపుకుని వెళ్లడంలో కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి విఫలమయ్యారని ఎక్కువ మంది బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆమె అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత అందరూ స్వాగతించారు. సోము వీర్రాజు కూడా పెద్దగా నిరాశకు గురి కాలేదు. పురందేశ్వరి నాయకత్వంలో పని చేస్తామన్నారు.
అయితే కమిటీలు నియమించిన తర్వాత వారి సూచనలు ఏవీ పరిగణనలోకి తీసుకోకపోవడం.. బీజేపీ కోసం సీరియస్ గా పనిచేసే నేతలను కూడా పక్కన పెట్టడంతో సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. సీనియర్ నేతలు పురందేశ్వరి తీరు బీజేపీకి మేలు చేసేదిలా లేదని సైలెంట్ అయిపోయారంటున్నారు. అందర్నీ కలుపుకుని పోక పోవడం వల్లనే సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ, అప్పులు, ఆర్థిక స్థితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు విషయంలో పురందేశ్వరి ముందుగానే ఖండించారు. ఆ తర్వాత కూడా టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కేవలం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆ బీజేపీ సీనియర్లు పురందేశ్వరి టీడీపీతో పొత్తు కోసమే పని చేస్తున్నారని అనుమానిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఇష్టం లేని నేతలు పురందేశ్వరి కార్యాచరణను వ్యతిరేకిస్తున్నారు. అందుకే సైలెంట్ అయ్యారు. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఓ ప్రాంతీయ పార్టీ బలహీనపడితే ఆటోమేటిక్ గా బీజేపీ బలపడుతుంది.
అందులోనూ సామాజిక వర్గ సమీకరణాలు, ఇతర రాజకీయాలు చూస్తే టీడీపీకి ఎంత బలహీనపడితే బీజేపీకి అంత బలమవుతుందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన కంటే.. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి… పొత్తులు పెట్టుకునేందుకు పని చేస్తున్నారని.. పార్టీ హైకమాండ్ దృష్టికి ఈ విషయాలన్ని తీసుకెళ్లాలని.. సీనియర్ నేతలంతా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలప్రచారంలో బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత.. ఏపీ బీజేపీ పంచాయతీని హైకమాండ్ ముందు పెట్టి పార్టీని కాపాడాలని కోరాలని సీనియర్లు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.