దేశంలో అత్యంత సుందరమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి. పొడవైన తీరప్రాంతంతో పక్కనే పచ్చని కొండలతో అత్యంత అందంగా కనిపిస్తుంది. ఇలాంటి నగరానికి కాలుష్యం ముప్పు పొంచి ఉంది. అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందుతోంది. దేశంలో టాప్ టెన్ కాలుష్య నగరాల జాబితాలో విశాఖ ఉండడం ఇప్పుడు కలవర పెడుతోంది. వైజాగ్ పోర్ట్, ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం విశాఖను ఇబ్బంది పెడుతోంది.దీనికి తోడు దీపావళి రోజున కాల్చిన క్రాకర్స్ కారణంగా విశాఖను గాలి కాలుష్యం కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి వెళ్లింది. ఈ AQI ఏకంగా 308 కు చేరింది. దీపావళి రోజు దేశవ్యాప్తంగా 245 నగరాలు, పట్టణాల్లోని గాలి నాణ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి 10.30 గంటల వరకు ఉన్న పరిస్థిని సీపీసీబీ వివరించింది.
దేశంలో మొత్తం 53 నగరాలు, పట్టణాలలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో ఉంది. ఆ జాబితాలో విశాఖపట్నం కూడా ఉండడం ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నగరాలు, పట్టణాల్లో శాంపిల్స్‌ను సీపీసీబీ సేకరించగా అత్యధికంగా చిత్తూరులో ఏక్యూఐ 348 పాయింట్లు ఉండగా, విశాఖలో ఏక్యూఐ 308గా నమోదైంది.సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు విశాఖలో బాణసంచా మోతతో మోగింది. ఒకపక్క వాయు కాలుష్యం, మరోపక్క శబ్ద కాలుష్యంతో విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతే కాదు గాలి కాలుష్యం సైతం అదే స్థాయిలో నమోదైంది. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా వన్ టౌన్, ఎన్ఎడీ, గాజువాక, పోర్ట్ రోడ్, సిరిపురం జంక్షన్ లాంటి ఏరియాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగి గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీని నిర్ధారించే పార్టికలేట్ మ్యాటర్ (పీఎం) 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం గల కణాలను కాలుష్యానికి ముఖ్య కారకాలుగా సీపీసీబీ గుర్తిస్తుంది. గతేడాది దీపావళి సందర్భంగా నగరంలో ఈ గాలి నాణ్యత 233గా నమోదు కాగా ఇప్పుడు అది 308కి చేరడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
ఈ తరహా కాలుష్యంతో ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె, క్యాన్సర్, చర్మ వ్యాధులు వస్తుంటాయని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ (AQI) 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తిగా, 101 నుంచి 200 అయితే మోడరేట్‌గా, అంతకు మించి 201 నుంచి 300 అయితే పూర్‌గా, ఇక 301 నుంచి 400 వరకు అయితే వెరీ పూర్, 401 నుంచి 500 అయితే తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లు పరిగణిస్తారు. కానీ విశాఖలో ఏక్యూఐ 348గా నమోదు కావడం, వెరీ పూర్ కేటగిరీలో నాసిరకంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.