cong-mani
తెలంగాణ రాజకీయం

గ్యారెంటీలు గట్టెక్కిస్తాయా…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన 6 గ్యారెంటీలు సహా మొత్తం 36 అంశాలను ఇందులో పొందుపర్చారు. ప్రధానంగా విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, వ్యవసాయం, విద్యుత్, రిజర్వేషన్లు, పెన్షన్లు, ఇళ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. పేదల కష్టాలను అర్థం చేసుకున్నామని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అటు, అధికార బీఆర్ఎస్ సైతం అన్ని వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టోలో హామీలను పొందుపరిచింది. గత పదేళ్లుగా అందిస్తోన్న హామీలు అమలు చేయడం సహా ప్రభుత్వ ఆదాయాన్ని పేదలకు పంచడమే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్  స్పష్టం చేశారు. కొత్త పథకాలతో ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలు చేర్చారు.
ప్రధాన హామీలు చూస్తే
 మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
మహిళల కోసం మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
‘సౌభాగ్య లక్ష్మి’ పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం రూ.400కే గ్యాస్ సిలిండర్.
రైతుల కోసం
‘రైతు భరోసా’ కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, వరి పంటకు అదనంగా రూ.500 బోనస్
రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు సహా, భవిష్యత్తులో మరిన్ని పథకాలను తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
పింఛన్లు
పింఛను దారులకు నెలకు రూ.4 వేల పింఛను. ‘ఆరోగ్య శ్రీ’ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం.
ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు పెంపు. తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద  తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం
 ఇళ్ల స్థలాలపై హామీలు
ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం సహా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం. ‘గృహజ్యోతి’ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితం
ఇంటి జాగా లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హౌసింగ్ పాలసీ కొనసాగింపు. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలకు (డ్వాక్రా సంఘాలకు) సొంత భవనాలు.
విద్యార్థుల కోసం
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే ప్రోత్సాహకాలు. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థిని ఓ ఎలక్ట్రిక్ స్కూటీ.
రెసిడెన్స్‌ స్కూల్ విధానం కొనసాగించాలని నిర్ణయం. రెసిడెన్స్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు.ఇవే కాక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. ఆటో డ్రైవర్లకు ప్రోత్సాహకాలు, ఆర్టీసీ డ్రైవర్లకు హామీలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హమీ సహా, ప్రభుత్వ ఉద్యోగాలకు ఓపీఎస్ అమలు సహా ఉద్యోగాల భర్తీ, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన, ఒకసారి ఫీజు కడితే పోటీ పరీక్షల ఫీజు మినహాయింపు వంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. అటు బీఆర్ఎస్ సైతం దళిత బందు కొనసాగింపు, దళితులకు అసైన్డ్ భూముల హక్కులు కల్పించే ప్రయత్నం, అనాథల కోసం ప్రత్యేక పథకం, ముస్లిం బడ్జెట్ పెంపునకు హామీలను తమ మేనిఫెస్టోలో చేర్చారు. ఓ వైపు, గత పదేళ్లలో అమలు చేసిన హామీలు సహా పేదలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు మేలు చేసేలా కొత్త పథకాలను అమలు చేస్తామని అధికార బీఆర్ఎస్ చెబుతుండగా, విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగం, మహిళలకు మేలు చేకూరేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ హామీలు తెలంగాణ ప్రజలను ఎంతవరకూ ఆకర్షించాయో తెలియాలంటే డిసెంబర్ 3 వరకూ వేచి చూడాల్సిందే.