ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఇప్పటిది కాదు. నెహ్రూ కాలం నాటి నుంచి పరంపరగా వస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది తెలంగాణ ఉద్యమం. అయితే తాజాగా పశ్చిమ ఒడిశాలో కోశాల్ పేరుతో ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కొందరు నిరసనలు తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం దీని తీవ్రత ఊపందుకందనే చెప్పాలి. దీని కోసం ప్రత్యేకంగా కోశల్ రాజ్య మిలిత కార్జ్యానుష్టన్ కమిటీ ఏర్పడి 11 జిల్లాల్లో బంద్‌కు పిలుపనిచ్చింది. ఈరోజు ఉదయం బోలంగీర్‌లో బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. ఆందోళనకారులు ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద ఎత్తున నినాదాల చేస్తూ రోడ్లపైకి వచ్చారు. బంద్ కారణంగా వ్యాపార సంస్థలు, షాపులు స్వచ్ఛందంగా మూసివేయగా.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బంద్ వేళ పోస్టాఫీస్ తెరచి ఉంచడంతో నిరసనకారులు ప్రదాన గేట్‌కి తాళం వేశారు. చాలా ప్రాంతాల్లో బస్సులను రోడ్లపై నిలిపి వేయడంతో రోడ్ల పై వాహనాలు నిలిచిపోయాయి.
రాంపూర్, డుంగురిపల్లి ప్రాంతాల్లో కోశాల్ ప్రత్యేక హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ప్రత్యేక బ్యానర్లు పట్టుకొని పెద్దగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు.ఇక భవానీపట్నం, కేసింగ ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులు కూడా నిలిచిపోయాయి. సంబల్‌పూర్‌లోని రైరాఖోల్ జాతీయ రహదారిని ఆందోళనకారులు చుట్టుముట్టారు. రోడ్డుపై వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. మరి కొందరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 11జిల్లాల్లో వైద్య సేవలు మినహా అన్ని సేవలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దఫా తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో అభివృద్దిలో వెనకుబడిపోయిందని తమ ఆవేదనను వ్యక్త పరిచారు స్థానికులు. అందుకే కోశల్ కి ప్రత్యేక హోదా కల్పించాలని మహాబంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక క్యాటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రాన్నైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇస్తున్నారని కోశల్ రాజ్య మిలిత కార్జ్యానుష్టన్ కమిటీ చైర్మన్ ప్రమోద్ మిశ్రా అన్నారు. తమ ప్రాంతాన్ని వెంటనే అభివృద్ది చేసేలా చర్యలు తీసుకోవాలని లేని ఎడల బంద్ మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ గవర్నర్‌కు మెమోరాండం సమర్పించారు.