- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపకల్పన
- ప్రభుత్వోద్యోగాల్లో ఇక 95 శాతం స్థానికులకే
- ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి
- కొత్త విధానంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సుదీర్ఘ కసరత్తు తర్వాత, గొప్ప విజన్‌తో కొత్త జోనల్ విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతాయి. అత్యుత్తమ జోనల్ విధానాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు.
–కేటీఆర్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి
నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికీ విద్య, ఉద్యోగాల్లో సమాన వాటా దకుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్‌తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. నూతన జోనల్ వ్యవస్థతో ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు 7 జోన్లు, 2 మల్టీ జోన్లతో నూతన విధానాన్ని తమ ప్రభుత్వం రూపొందించిందని వివరించారు. పాలనా ప్రయోజనాలను ప్రజలకు వేగంగా చేరవేసేందుకు జిల్లాలను పునర్వ్యవస్థీకరించామని చెప్పారు.
ఆ జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం ద్వారా జిల్లా స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ నుంచి జోన్లు, మల్టీ జోన్ ఉద్యోగాల వరకు అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవలే ఏర్పాటైన ములుగు, నారాయణపేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధత కల్పించటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల జిల్లా ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం వివిధ శాఖల్లో లక్షా 33 వేలపై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేండ్లలో టీఎస్-ఐపాస్ ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని, వేల పరిశ్రమల స్థాపన జరిగిందని, తద్వారా దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయని మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దకేలా చర్యలు తీసుకోవటంతోపాటు ప్రైవేటు కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా విధాన నిర్ణయాలు తీసుకొన్నామని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దక్కేలా చర్యలు తీసుకొంటున్న సీఎం కేసీఆర్‌కు ప్రజల పక్షాన మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.