- ప్రధానికి లేఖ.. ఏపీ ప్రజలను వంచించడమే
- కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణను మోసగించలేరు
- ఏపీ సర్కారుపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తండ్రిని మించిన దుర్మార్గుడని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గతంలో కృష్ణా జలాలను దోచుకుపోయే పద్ధతుల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించడం, పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం వంటి చర్యలతో జగన్.. తండ్రిని మించిపోయారని దుయ్యబట్టారు. రెండు రాష్ర్టాల మధ్య వివాదాన్ని సృష్టించిందే ఏపీ ప్రభుత్వమన్నారు. శుక్రవారం సూర్యాపేటలో మీడియాతో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించినప్పటికీ, దానిని ఖాతరు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
తెలంగాణను మోసం చేసేందుకే
గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా తెలంగాణను మోసం చేసేందుకు ఏపీ సర్కార్ కుట్రలు పన్నుతున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కులను హరించే శక్తి ఏ ఒక్కరికీ లేదన్నారు. మద్రాస్‌కు మంచినీళ్ల పేరుతో నాడు వైఎస్ నీళ్లను దోచుకుపోయారన్నారు. అదే కాల్వలను వెడల్పు చేస్తూ 300 టీఎంసీలు రాయలసీమకు తరలించేందుకు ఇప్పుడు జగన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ భూములను ఎండబెట్టి, ఆయకట్టు రైతాంగానికి 50 ఏండ్లుగా ద్రోహం చేసిన చరిత్ర ఆంధ్ర పాలకులదని విమర్శించారు.
మూర్ఖంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరు ప్రాంతాల రైతులకు ప్రయోజనకారిగా ఉండే ఫార్ములాను గతంలో జగన్మోహన్‌రెడ్డి ముందు పెట్టారని, అప్పుడు జగన్ స్పందించకుండా ఇప్పుడు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో గోదావరి జలాల వివాదాన్ని ఏడాదిలోనే పరిష్కరించిన కేసీఆర్.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి కూడా స్నేహం హస్తం అందించారని గుర్తుచేశారు. ఏపీ ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.