తెలంగాణ

మా వాటాను వదులుకోం

  • పోతిరెడ్డిపాడుతో వైఎస్సార్‌ జల దోపిడీ
  • సీమ లిఫ్ట్‌తో మరో దోపిడీకి జగన్‌ యత్నం
  • ఏపీ సీఎంపై మండిపడ్డ మంత్రి పువ్వాడ

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా జలదోపిడీకి పాల్పడ్డారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వీ వెంకటాయపాలెంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తండ్రి బాటలోనే ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ లిఫ్ట్‌ పేరుతో మరో దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా నుంచి తెలంగాణకు వచ్చే వాటాలో ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ నీటి వాటాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకునేందుకు అనేక ప్రాజెక్టులను నిర్మిస్త్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నుంచి రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు రావాల్సిన నీటి వాటాను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు. 890 అడుగులకుపైగా ఎత్తు ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడం లేదన్నారు. అక్రమంగా ఎత్తు తగ్గించి జలదోపిడీకి పాల్పడితే తెలంగాణ రైతాంగం ఊరుకోదని హెచ్చరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై ఏపీ సీఎం జగన్‌ కేంద్రానికి లేఖలు రాయడాన్ని మంత్రి పువ్వాడ తప్పుబట్టారు. కేంద్రానికి లేఖ రాసినా, రాష్ట్రపతికి రాసినా తెలంగాణ వాటాను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు.