nitish kumar
జాతీయం రాజకీయం

75 శాతానికి చేరిన బీహార్ రిజర్వేషన్లు

బీహార్‌లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నితీష్ కుమార్ ప్రభుత్వ తీసుకువచ్చిన నూతన రిజర్వేషన్ విధానానికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం తెలిపారు. రిజర్వేషన్ బిల్లు గవర్నర్ స్థాయి నుండి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో బీహార్‌లోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్ ప్రక్రియలలో రిజర్వ్‌డ్ కేటగిరీ ప్రజలకు 65 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్‌లకు మార్గం సుగమమైంది.ఇప్పటి నుంచే బీహార్‌లో 75 శాతం రిజర్వేషన్ల ప్రయోజనం అందుబాటులోకి రానుంది. అంటే, ఇక నుంచి షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్ తెగ, ఈబీసీ, ఓబీసీలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ల ప్రయోజనం లభిస్తుంది. ఇది మంగళవారం నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చింది. బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్ పరిమితిని 15 శాతం పెంచింది.అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్ సవరణ బిల్లు 2023ని ప్రవేశపెట్టింది.

నవంబర్ 9న ఉభయ సభలు ఆమోదించాయి. రిజర్వేషన్ల పరిధిని 75 శాతానికి పెంచాలని నిబంధన పెట్టారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా ఈ బిల్లుకు మద్దతు పలికింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రిజర్వేషన్ బిల్లు-2023కి ఆమోదం తెలిపారు.ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అత్యంత వెనుకబడిన తరగతులు  ఇతర వెనుకబడిన తరగతుల  రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుండి 65 కి పెంచాలని నితీష్ సర్కార్ ప్రతిపాదించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ తరగతుల రిజర్వేషన్లను పెంచాలని ప్రతిపాదించిన బిల్లులను మూజువాణి ఓటు ద్వారా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఎస్టీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను రెట్టింపు చేయగా, ఎస్సీలకు 16 శాతం నుంచి 20 శాతానికి పెంచనున్నారు. కాగా, ఈబీసీ రిజర్వేషన్లను 18 శాతం నుంచి 25 శాతానికి, ఓబీసీ రిజర్వేషన్లను 12 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నారు.ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం జనాభాలో 19.7 శాతం ఉన్న ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఇది ప్రస్తుత 16 శాతం కంటే ఎక్కువ అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సభలో ప్రతిపాదించారు.

జనాభాలో 1.7 శాతం ఉన్న ఎస్టీలకు రిజర్వేషన్లను ఒక శాతం నుంచి రెండు శాతానికి రెట్టింపు చేయాలి. జనాభాలో 27 శాతం ఉన్న ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ)లకు 18 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని ఆయన చెప్పారు. రెండు వర్గాలకు కలిపి 43 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నితీశ్ ప్రతిపాదించారు. ఈ పెంపుదలలో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో బీహార్ ప్రతిపాదించిన రిజర్వేషన్లు 75 శాతానికి పెరుగనున్నాయి.