thermal power
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ధర్మల్ ప్లాంట్ కు బొగ్గు కొరత

రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల పరిస్థితి దినదినగండంగా మారింది. ప్లాంట్లకు ఒక్క రోజు బొగ్గు ఆగినా అందులో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. కనీసం 15 రోజులకు 10,73,835 మెట్రిక్‌ టన్ను(ఎం.టి)ల బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే, అవసరమైనదాంట్లో 9శాతం బొగ్గు మాత్రమే జెన్‌కో ప్లాంట్‌లో ప్రస్తుతం ఉంది. దీనిని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటి అథారిటీ (సిఇఎ) సైతం ధ్రువీకరించింది. రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో మూడు థర్మల్‌ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇవి నడవాలంటే రోజుకు 71,100 ఎం.టిల బొగ్గు అవసరం. ప్రస్తుతం మూడు ప్లాంట్లలో రెండింటిలో ఒకటిన్నర రోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. రైల్వే శాఖ నుంచి ఎంవి రమణారెడ్డి రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎంవిఆర్‌ఆర్‌టిపిపి), విజయవాడలోని నార్లా తాతారావు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఎన్‌టిటిపిఎస్‌)కు తక్కువ బొగ్గు సరఫరా జరుగుతుందని సిఇఎ పేర్కొంది. రైలుమార్గం ద్వారా జరిగే ఈ సరఫరాలో ఏ మాత్రం ఆటంకం ఏర్పడినా కరెంట్‌ కోతలతో అంధకారం నెలకొనే ప్రమాదం ఉంది.

రైల్వే కూడా సాధారణ రైళ్లకు ఎక్కువగా క్లియరెన్స్‌ ఇచ్చి గూడ్స్‌ వాహనాలను ఆపుతోంది. ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం వల్ల కృష్ణపట్నం ప్లాంట్‌కు ఒడిషాలోని మహానది గని నుంచి రావాల్సిన బొగ్గు రెండు రోజులు ఆలస్యంగా వచ్చింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించి జెన్‌కో అధికారులు సర్దుబాటు చేశారు. ప్లాంట్లకు బొగ్గులో కూడా నాణ్యత లేదనే ఆరోపణలు ఉన్నాయి. బొగ్గులో మట్టి ఎక్కువగా ఉండటంతో అనుకున్నంత ఉత్పత్తి జరగడం లేదు. నిబంధనల ప్రకారం ప్లాంట్‌ లోడ్‌ ఫాక్టర్‌(పిఎల్‌ఎఫ్‌) 85శాతం ఉండాలి. అయితే ఎపి జెన్‌కో మూడు ప్లాంట్లు కలిపి 59శాతం మాత్రమే ఉంది. ఎన్‌టిటిపిఎస్‌ 73శాతం, రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌ 71శాతంతో ఉండగా, కృష్ణపట్నం ప్లాంట్‌ కేవలం 40శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 223 మిలియన్‌ యూనిట్లు(ఎంయు) విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. డిస్కంలకు అవసరమైన విద్యుత్‌ జెన్‌కో నుంచి 91(ఎంయు), కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి 40(ఎంయు), హిందుజా నుంచి 17ఎంయు, సోలార్‌ విద్యుత్‌ 30ఎంయుల వరకు విద్యుత్‌ వస్తుంది. మిగిలిన కొరతను డిస్కంలు పవర్‌ ఎక్స్చేంజ్‌ మార్కెట్‌ నుంచి రూ.9ల వరకు కొనుగోలు చేస్తున్నాయి.

ఎన్‌టిటిపిఎస్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి రోజుకు 28,500 మిలియన్‌ టన్ను(ఎం.టి)లు బొగ్గు అవసరం. ప్రస్తుతం అక్కడ 520,81ఎంటిల బొగ్గు మాత్రమే ఉంది. ఎంవిఆర్‌ఆర్‌టిపిపి రోజుకు 21వేల ఎంటిల బొగ్గు కావాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ 30,337 ఎంటిలు మాత్రమే ఉంది. నెల్లూరులోని కృష్ణపట్నం ప్లాంట్‌కు రోజుకు 19,000ఎంటిల బొగ్గు కావాల్సి ఉండగా, అక్కడ 170560 ఎంటిల నిల్వ ఉంది. రెండో దశ కింద ప్రారంభించిన మూడో యూనిట్‌కు సరిపడ బొగ్గు లేకపోవడంతో రెండు రోజుల క్రితం అక్కడ ఉత్పత్తి నిలిచింది. శనివారమే బొగ్గు వ్యాగన్లు రావడంతో 170560ఎంటిలకు నిల్వ చేరుకుంది. సాంకేతిక కారణంతో ఆ యూనిట్‌ ఆదివారం కూడా పనిచేయలేదు. ఈ ప్లాంటును కొంత విదేశీ బొగ్గుతో నడపాల్సి ఉండగా, అది అందుబాటులో లేకపోవడంతో స్వదేశీ బొగ్గుతోనే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు.రాష్ట్రాల జెన్‌కో ప్లాంట్లకు సరిపడ బొగ్గును కోల్‌ ఇండియా సరఫరా చేయడం లేదు. మరోవైపు ఎపి జెన్‌కో యాజమాన్యం వైఫల్యం కూడా కనిపిస్తోంది. రాష్ట్ర జెన్‌కోలకు సరిపడ అందించలేని కోల్‌ ఇండియా నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టిపిసి)లకు, ప్రైవేట్‌ ఉత్పత్తి ప్లాంట్లకు అందిస్తుంది.

నిబంధనల ప్రకారం 15 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలను ప్లాంట్లు సమకూర్చుకోవాలి. ఎన్‌టిపిసి ప్లాంట్లు 15 రోజులకు సరిపడ బొగ్గులో 57శాతం ఉంచుకుంటూ రాష్ట్ర జెన్‌కో ప్లాంట్లలకు మాత్రం తక్కువ స్థాయిలో సరఫరా చేస్తోంది. ప్లాంట్లకు అవసరమైన బొగ్గును జెన్‌కో రైల్‌ మార్గం ద్వారా తెప్పించుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్లాంట్లకు అవసరమైన బొగ్గును జెన్‌కో మహనది బొగ్గు గనుల నుంచి రావాల్సి ఉంది. అయితే మహనదికి బకాయిలు ఉండడంతో అవసరమైన బొగ్గు రావడం లేదు. కేవలం రోజు వారి చెల్లింపులు ద్వారా మాత్రమే బొగ్గును జెన్‌కో తెచ్చుకుంటోంది.