తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఇక మిగిలింది కేవలం వారం రోజులు మాత్రమే. ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో అన్ని పార్టీలు ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రేపటితో రాజస్థాన్ పోలింగ్ ముగియనుండంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో మకాం వేయనున్నారు. దేశంలోని బడా బడా నేతలంతా ఇక్కడికే తరలిరానున్నారు. నవంబర్ 24 నుంచి వరుసగా 5 రోజుల పాటు ప్రచారం మోతమోగించనున్నారు. 24 నుంచి 28 వరకు పలు నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో హోరెత్తించనున్నారు. దీని కోసం రాష్ట్రంలోని ఆయా పార్టీల నేతలు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హామీలు, విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ దద్దరిల్లనుంది. అధికార పార్టీ తరుఫు నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. ఇతర నాయకులు ఆల్రెడీ సుడిగాలి పర్యటనలు చేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నారు. అవతలి వైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఏమీ తక్కువ తినడం లేదు.
ఇప్పటికే ప్రధాన మోదీ, రాహుల్ గాంధీతో సహా పెద్ద పెద్ద నేతలంతా రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. ఇప్పుడు పోలింగ్‌కు ముందు 5 రోజులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. అది కూడా ఏదో ఒక్క సభకు రావడం వెళ్ళిపోవడం కాకుండా.. ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొననున్నారు. బహిరంగసభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులూ తెలంగాణలోనే ఉండనున్నారు. ఇక్కడ తిరుగుతూ పూర్త ఇస్థాయిలో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 24,26,28 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మూడు రోజులు ప్రచారంలో పాల్గొంటారు.
ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వశర్మ, సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు.కాంగ్రెస్ తరుపు నుంచి రాహుల్ ప్రియాంక నవంబర్ 24 నుంచి 28 వరకు ఇక్కడే ఉండే వరుస సభల్లో పాల్గొననున్నారు. దాదాపు 20 వరకు సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పది నియోజకవర్గాలను పర్యటిస్తారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండి 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు, నాలుగు రోజులు వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.ఇక ఇతర ప్రధాన పార్టీ అయిన సీపీఎం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాషిణి అలీ, విజయరాఘవన్ మరికొందరు 25, 26, 27 తేదీల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొననున్నారు.