తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో కనీస ప్రాథమిక ఆధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాలతో ఇచ్చిన మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులను 29వ వరకూ కొనసాగిస్తూ తర్వాత వాటినీ తొలగించారు. వీటిపై సీఐడీ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేసింది. విచారణకు వచ్చినా బెయిల్ రద్దు చేయడం అనేది ఉండకకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని హైకోర్టు తేల్చడమే కాకుండా అప్పటికే చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఈ కారణంగా బెయిల్ రద్దు చేయకపోవచ్చని చెబతున్నారు. మరి చంద్రబాబునాయుడుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లేనా ?. స్కిల్ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ దొరికినట్లు కాదు. ఎందుకంటే ఆయనపై ఉన్నది ఆ ఒక్క కేసు కాదు. మొత్తం ఆరు కేసులు ఉన్నాయి. అందులో ఒక్క కేసులోనే బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏమీ తేలడం లేదు.
వరుసగా సీఐడీ విచారణ సందర్భంగా వాయిదాలు కోరుతూనే ఉంది. వాయిదాలు పడుతూనే ఉంది. ఒక్ వేళ అన్నింటిలోనూ రిలీఫ్ వచ్చినా.. మరి కొన్ని కేసులు పెట్టడానికి సీఐడీ రెడీగా ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. అందుకే చంద్రబాబుకు రిలీఫ్ దక్కాలంటే.. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన 17ఏ సెక్షన్ వర్తింపుపై అనుకూల తీర్పురావాలి. ఆ తీర్పు అనుకూలంగా వస్తే చంద్రబాబు అతి పెద్ద రిలీఫ్ పొందుతారు. ఆయనపై నమోదు చేసిన కేసులన్నీ చెల్లకుండా పోతాయి. మళ్లీ కొత్తగా ఏదైనా కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోలాంటే.. సీఐడీ కేసు పెట్టేసినట్లుగా ఏదో ఒకటి చెప్పి కేసు పెట్టేయడం కాదు.. చంద్రబాబుకు ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక ఆధారాలు చూపించాలి. అది అసాధ్యం కాబట్టి 17ఏ సెక్షన్ వర్తింపుపై అనుకూల తీర్పురావడమే చంద్రబాబుకు కీలకమని చెబుతున్నారు.స్కిల్ కేసులోనే అరెస్టు చేసినప్పుడే హైకోర్టులో క్వాష్ పిటిషన్ చంద్రబాబు దాఖలు చేశారు. అయితే 17ఏ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తీర్పు చెప్పారు.
ఈ తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. హోరాహోరీ వాదనలు సాగాయి. ఏసీబీ చట్టంలోనే సెక్షన్ 17ఏ తెచ్చింది కుట్రపూరితంగా పెట్టే రాజకీయ వేధింపుల కేసుల నుంచి అంతకు ముందు పదవుల్లో ఉన్న వారికి రక్షణ కోసమేనని ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలు క్లియర్ కేస్‌గా రీజియమ్ రివెంజ్ అని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. కేసు వాదనల సమయంలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, గత తీర్పులను బట్టి చూస్తే చంద్రబాబుకు గట్టి రిలీఫ్ ఖాయమని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. కానీ వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. దీపావళి సెలవుల తర్వాత ప్రకటిస్తామని బెంచ్ ప్రకటించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ 30వ తేదీన జరగాల్సి ఉంది. ఈ లోపే తీర్పు వస్తుందని ఆశిస్తున్నారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్లో ఉంచాలని వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు గట్టి పట్టుదలగా ఉన్నారని వరుసగా నమోదు చేస్తున్న కేసుల్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. బెయిల్ వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లిన వైనమే వారి ఆలోచన ధోరణిని తెలియచేస్తుందని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు 17ఏ విషయంలో నిరాశ ఎదురయితే.. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆయనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంది. అన్ని కేసుల్లో ఒకే సారి కాకుండా.. ఒక కేసు తర్వాత మరో కేసును తెర ముందుకు తెచ్చి బెయిల్ వచ్చే సమయంలో మరోసారి అరెస్టు చూపించే వ్యూహాలను అమలు చేయవచ్చున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే దీన్నికొట్టి పారేయలేమని టీడీపీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. న్యాయపరమైన వివాదాలన్నీ తేలిపోతే చంద్రబాబు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడానికి అటంకాలు ఏమీ ఉండవు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో రెండు, మూడు నెలల పాటు ప్రజల్లోకి వెళ్లకుండా ఉన్న సందర్భాలు దాదాపుగా లేవు. అరెస్టు అయిన సమయంలోనూ ఆయన రాజకీయ యాత్రలో ఉన్నారు. భవిష్యత్ కు భరోసా పేరుతో ఆయన పూర్తి స్థాయిలో యాత్రలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
మూడు నెలల సమయం వృధా అయినందున.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నందున ఇక చంద్రబాబు.. పర్యటనల్లోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. జనసేన ను సమన్వయం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రాజకీయం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు పూర్తి స్థాయి రాజకీయంపై..సుప్రీంకోర్టులో రావాల్సిన 17ఏపై తీర్పే ఆధారం కానంది. ఆ తీర్పు కోసమే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.