హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఇంజనీరిగ్ సర్టిఫికేట్లు.. ఎక్కడా అని అనుకుంటున్నారా..? ఎక్కడో కాదు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనే. ఎంత పకడ్భందిగా తయారు చేస్తున్నారంటే.. అమెరికా కాన్సులేట్ అధికారులు మాత్రమే గుర్తించగిగే స్థాయిలో ఈ నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తున్నారు. మొత్తం మీద నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న వ్యక్తిని కేంద్రం క్రైం విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన హేమనాద్ అమెరికా వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఇందులో భాగంగానే చెన్నైలోని అమెరికా కాన్సులేట్ నుంచి వీసా కోసం పిలుపు వచ్చింది. దీంతో హేమనాథ్ చెన్నైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వచ్చాడు. వచ్చిన వెంటనే హేమనాథ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాన్సులేట్ అధికారుల విచారణలో అసలు నిజం చెప్పేశాడు.బీటెక్ పూర్తి చేసినట్లు హేమనాధ్ కాన్సులేట్ అధికారులకు సమర్పించిన సర్టికేట్లు నకిలీవిగా గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నర్సరావుపేటకు చెందిన హరిబాబు అనే వ్యక్తి తనకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు తయారు చేసి ఇచ్చినట్లు చెప్పాడు.
దీంతో కేంద్ర క్రైం విభాగం అధికారులకు చెన్నై కమిషనర్ కార్యాలయం నుంచి ఫిర్యాదు అందింది. నకిలీ సర్టిఫికేట్లకకు నర్సరావుపేట కేరాఫ్ అడ్రస్‌గా మారిందని భావించిన కేంద్ర క్రైం విభాగం అధికారులు రెండు రోజుల క్రితం నర్సరావుపేట వచ్చారు. నర్సరావుపేటకు చెందిన హరిబాబు ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన హరిబాబు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి ఇస్తుంటాడు. ఇందుకోసం లక్షల్లో వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. నర్సరావుపేట వచ్చిన కేంద్ర క్రైం విభాగం డిప్యూటీ కమీషనర్ సెంధిల్ కుమార్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీపై దాడి చేసి హరిబాబును అదుపులోకి తీసుకున్నారు.హరిబాబు కార్యాలయంలో విస్త్రుతంగా తనిఖీలు చేసి కంప్యూటర్, రెండు లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్, కొన్ని ఫేక్ సర్టిఫికేట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర క్రైం విభాగం అధికారులు చెప్పారు. అయితే స్థానిక పోలీసులు, అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయడంపై స్థానికంగా కలకలం రేగింది. గతంలోనూ ప్రకాష్ నగర్‌లో ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో మరోసారి ఫేక్ సర్టిఫికేట్లు బయట పడటంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.