fishing harbour
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఫిషింగ్ హార్బర్ కేసులో దొరకని ఆచూకీ

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధమైన ఘటనలో పోలీసులకు ఎటువంటి క్లూస్ లభించలేదు. ప్రస్తుతం వాసుపల్లి నాని, అల్లిపిల్లి సత్యం అనే ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  వాసుపల్లి నాని ఫిషింగ్ హార్బర్ లో కొన్ని బోట్లకు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.  సత్యం అక్కడ వంటచేసే వాడిగా చెబుతున్నారు. సత్యం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగి ఉండే అవకాశం లేకపోలేదన్న కోణంలోనూ విచారణ జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. కాగా ఈ ప్రమాదంలో తొలుత అభియోగాలు ఎదుర్కొన్న లోకల్ బాయ్ నానిని గురువారం సాయంత్రం వదిలేశారు పోలీసులు. విడుదల అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్‌ను కలిసి తను తప్పు చేయలేదంటూ అవేదన వ్యక్తం చేశాడు నాని. నానిపై ఆధారాలు లేకుంటే ఎందుకు ఇల్లీగల్ కస్టడీలో ఉంచుకున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు జీవీఎల్.మరోవైపు ఏపి హైకోర్టులో గురువారంహెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు యూట్యూబర్ నాని కుటుంబ సభ్యులు.

అగ్ని ప్రమాదం ఘటనపై ప్రమేయం లేనప్పటికీ.. నానిని పోలీసులు అదుపులో ఉంచుకున్నారంటూ.. కోర్టులో పిటిషన్ వేయడంతో.. అలెర్టయిన పోలీసులు.. నానిని విడుదల చేశారు. అయితే తన పరువుకు నష్టం కలిగించేలా పోలీసులు వ్యవహరించాని.. 20 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు నాని.యూ ట్యూబ్‌లో లోకల్ బాయ్ నానిగా గుర్తింపు పొందాడు నాని. సముద్రంపై వేటకు వెళ్లి.. వలకు పడిన చేపల దృశ్యాలను.. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తాడు. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బాయ్ నాని ఈ ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని నాని ఆ వీడియోలో చెప్పాడు. అయితే ప్రమాద సమయంలో తాను అక్కడ లేనని నాని చెబుతున్నాడు.“ఫిషింగ్‌ హర్బర్‌ ఘటనలో నా తప్పు లేదు. ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ లేను.

రాత్రి 11 తర్వాత ప్రమాదంపై సమాచారం అందింది. ఫోన్‌ వచ్చిన వెంటనే బయల్దేరి వెళ్లాను. ప్రమాదంపై ప్రభుత్వానికి సమాచారం అందించేందుకే.. ఘటన జరుగుతున్నప్పుడు నేను వీడియో తీశాను. వీడియో తీసిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్నాను” అని నాని తెలిపాడు.హార్బర్‌ ప్రమాదంపై రెవెన్యూ, ఫైర్ సర్వీస్, ఫిషరీస్, ఫోరెన్సిక్, పోలీస్ అధికారుల కమిటీ విచారణ చేస్తుంది. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా FIR నమోదు చేశారు వన్ టౌన్‌ పోలీసులు. అటు అనుమానిత యువకులను ప్రశ్నిస్తున్నారు. టెక్నీకల్ డేటా ఏనాలాసిస్ చేస్తున్న పోలీసులు, డంప్ కాల్స్ పై దృష్టి పెట్టారు.. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రమాదంపై లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.మరోవైపు ఈ సంఘటనతో….విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సెక్యూరిటీలో డొల్లతనం బయటపడింది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు గుర్తించారు. భద్రతా లోపాల గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సెక్యూరిటీని పెంచాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ మత్స్యకారులు వాపోతున్నారు. హార్బర్‌లో పోలీస్‌ ఔట్‌ పోస్ట్ ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌లోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియదంటున్నారు వాళ్లు.