chandra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అయ్యా.. నో… ఎస్ లు…

ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు  వారు ప్రత్యక్షంగా ప్రజలలోకి రారు. సర్వేలు చేయరు. విశ్లేషణలు చెప్పరు.. కానీ, రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడఏమేం జరుగుతోందో  ఇట్టే పట్టేస్తారు. పసిగట్టేస్తారు. రాజకీయలతో అసలు ఏమాత్రం సంబంధం లేనట్లుండే వీరు ఆ రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని  కూడా చూసేయగలరు.  అందుకు తగ్గట్టుగా తమ స్ట్రాటజీలు మార్చుకుంటారు. ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా క్యూ కట్టి మరీ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని  అధికారులు  ఇప్పటికే.. ఇప్పటికే ఏమిటి ఎప్పుడో  పసిగట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏదో విధంగా చంద్రబాబును కలుసుకునేందుకు తహతహలాడుతున్నారు. నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో వైఎస్సారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి.

జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బుక్కయ్యారు. జైలు పాలయ్యారు. అలాగే జగన్ రెడ్డి  ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుబోనెక్కారు. అవమానాలు ఫేస్ చేశారు. చీవాట్లు తిన్నారు. అయినా తాము చేసిది, చేస్తున్నది తప్పేనని తెలిసినా  కొందరు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఒత్తిళ్ళకు తలొగ్గి పని చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు అలాంటి వారంతా, ప్రభుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో నే తాము అడ్డ‌గోలు  నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డం లేద‌ని  ప్రైవేటు సంభాషణల్లో వాపోతున్నారు.అలాంటి వారు ఇప్పడు గతంలో చంద్ర‌బాబు నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ… త‌మ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ సీఐడీలో ప‌నిచేస్తున్న వారు చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని, పై అధికారులు, రాజకీయ పెద్దలు ఆడుతున్న జగన్నాటకంతో తాము పావులమంటూ   చెప్పుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు.  

అలాంటి దారులేవీ కనిపించని  అఖిల భారత సర్వీస్ అధికారులు ఇప్పుడు తప్పించుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎలాగోలా రాష్ట్రం వదిలి వెళ్లిపోతే చాలని భావిస్తున్నారు.  ఢిల్లీ సర్వీస్ కు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.  వీరిలో కొందరు జగన్ రెడ్డి సర్కార్ వచ్చాక వివిధ చోట్ల నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి  జగన్ ఏరికోరి తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.   మరికొందరు రాష్ట్ర సర్వీస్ అధికారులు కూడా ఉన్నారు.  వీళ్లందరికీ జరిగిందేమిటో తెలుసు, తమ తప్పిదాలేమిటో కూడా తెలుసు.  ప్రభుత్వం మారితే ఏం జరుగుతుందో తెలుసు. జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురౌతుందన్న ఆందోళన వీరిలో ఏర్పడిందని అంటున్నారు. అందుకే  అందుకే ముందుగానే  సర్దేసుకుని రాష్ట్రం వదిలిపోయేందుకు దారులు వెతుక్కుంటున్నారు.  కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.   మళ్లీ మనమే వస్తామని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎంతగా చెబుతున్నా బాబూస్ నమ్మడం లేదు. మళ్లీ జగన్ సర్కార్ వస్తే తిరిగి వస్తాం కానీ ఇప్పుడైతే మమ్మల్ని రిలీవ్ చేసేయండని, ఎన్వోసీ ఇవ్వండనీ బతిమలాడుకుంటున్నారు.  దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్ కొందరికి ఎన్వోసీ ఇచ్చేసింది.  

ఇలా రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని భావిస్తున్న వారిలో సీఐడీలో పని చేసిన సంజయ్, సునీల్ కుమార్,   స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి రామకృష్ణ, ప్రవీణ్ ప్రకాష్ సహా.. పది మంది  ఉన్నారు.  కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయినంత మాత్రానా చేసిన తప్పిదాలన్నీ చెరిగిపోయే పరిస్థితి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సామాజిక వర్గానికే ప్రాధాన్యమా…
వైసీపీ ప్రభుత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్ట్ లలో పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్రంలోని వివిధ సర్వీసుల నుంచి 16 మందిని డిప్యూటేషన్ పై తీసుకు రాగా వారిలో 10 మంది జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే అంటూ లిస్ట్ విడుదల చేశారు. కీలక శాఖలలో సొంత సామాజికవర్గ అధికారులను నియమించి జగన్ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత వర్గం అధికారులతో రాష్ట్రాన్ని దోచేస్తూ, ప్రశ్నించిన బడుగుల ప్రాణాలు తీస్తున్నారన్నారు. రాష్ట్రంలో, ఇతర వర్గాల్లో సమర్థులైన అధికారులు లేరా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఒకే వర్గం అధికారులకు పెత్తనం, కీలక పదవుల్లో నియమించడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు”ఇసుక దందాకు వెంకట్ రెడ్డిని తెచ్చారు. దోపిడీని ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేశారు. మద్యంలో సొంత బ్రాండ్ల ద్వారా జగన్ దోపిడిని ప్రశ్నించిన ఓమ్ ప్రకాష్ అనే దళిత యువకుడిని చంపేశారు. డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ పదవి కట్టబెట్టారు. తిరుమల పవిత్రత దెబ్బతీశారు. కోస్ట్ గార్డ్ సర్వీస్ జి.వి. వెంకట రెడ్డికి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ పోస్ట్ ఇచ్చారు.

ఆయనకు గనుల గురించి ఏమి తెలుసు. ఇప్పటికే రూ.40 వేల కోట్లు దోచేశారు.రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వాసుదేవ రెడ్డికి ఏపీ బెవరేజస్ కార్పోరేషన్ ఎండీ ఇచ్చి సొంత బ్రాండ్స్ తో అవినీతి చేస్తున్నారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి ఐ అండ్ పీఆర్ కమిషనర్ కట్టబెట్టారు. రైల్వే పర్సనల్ సర్వీస్ రమణా రెడ్డి కి ఎన్.ఆర్.ఇ.డి. క్యాప్ విసి అండ్ ఎండీ, రైల్వే అకౌంట్ సర్వీస్ మధుసూధన్ రెడ్డికి ఫైబర్ నెట్ ఎండీ, రైల్వే పర్సనల్ సర్వీస్ రెడ్డి సి.ఎన్. దివాన్ రెడ్డికి విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఎండీ, ఐఆర్ఎస్ చిలకల రాజేశ్వర్ రెడ్డికి స్పెషల్ కమిషనర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఐఆర్ఎస్ ఎం. రమణారెడ్డికి సీఇఓ ఏపీ టవర్స్ పోస్ట్, కేంద్రంలో చీఫ్ ఇంజినీర్ ఎస్.వి.కె. రెడ్డికి వాటర్ వేస్ సీఈఓ పదవులు కట్టబెట్టారు. వీటికి సీఎం జగన్ సమాధానం చెప్పగలరా? . అక్రమాలకు పాల్పడిన అధికారులు రేపు రాష్ట్రం వదిలి పారిపోయినా వదిలేది లేదని  అచ్చెన్నాయుడు హెచ్చరించారు.