kilari-dhulipalla
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పొన్నూరులో రాజకీయ్ గరం..గరం…

క్కడ అభివృద్ది ఏదైనా రాజకీయం కావాల్సిందే..! అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య నలగాల్సిందే..! అభివృద్దిని అడ్డుకుంటున్నారని అధికార పక్షం వాదిస్తుంటే, అభివృద్ది పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షం ధ్వజమెత్తుతోంది. అభివృద్ది మాట దేవుడెరుగు గానీ, రాజకీయ నేతల హాడావుడితో మాత్రం సామాన్యులు సతమతమవుతున్నారు. పొన్నూరులో రాజకీయం రంజుగా సాగుతుంది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ టినేతలు నువ్వా నేనా అంటూ ఢీ కొడుతున్నారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ది జరిగినా రాజకీయాలు చుట్టుముడుతున్నాయి. మొదట ఆటో నగర్ ఏర్పాటు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మధ్య చిచ్చు పెట్టింది. ఆలయ భూముల్లో ఉద్దేశపూర్వకంగానే ఆటో నగర్ ఏర్పాటు చేస్తున్నారని ధూళ్లిపాళ్ల ఆరోపించారు. అంతేకాదు షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో ఎమ్మెల్యే కిలారి అవినీతికి పాల్పడుతున్నాడని విమర్శించారు.అక్కడితో ఆగలేదు ఈ పంచాయితీ. అవినీతి జరగలేదని సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు ఎమ్మెల్యే రోశయ్య. దీంతో ఆటో నగర్ ఏర్పాటు రెండు పార్టీల మద్య పెద్ద చిచ్చు రేపింది.

ఆరోపణలు, ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున సాగాయి. కొంత కాలం తర్వాత రాజకీయ విమర్శల జడివాన తగ్గిందిలే అనుకుంటుండగానే పొన్నూరులోని మెయిన్ రోడ్డు విస్తరణ రాజకీయ నేతల మద్య విబేధాలకు కారణమైంది. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అనుకూలంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారంటూ ధూళిపాళ్ల ఆరోపించారు. స్థానికులు కనీసం తమ వస్తువులను సర్ధుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రొక్లెనర్లతో పడేశారని ధ్వజమెత్తారు. అంతేకాదు వర్షాలు పడి అసంపూర్ణ పనులతో స్థానికులు నష్టపోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదని విమర్శించారు దూళిపాళ్ల.అయితే ప్రతిపక్ష నేత ఆరోపణలను ఎమ్మెల్యే కిలారి రోశయ్య ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. గత పాతికేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల పొన్నూరు మెయిన్ రోడ్డు ను కూడా విస్తరించ లేకపోయారన్నారు ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా విస్తరణ పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ప్రత్యారోపణ చేశారు. ఇద్దరి మధ్య ఆరోపణలకు ఆటో నగర్ పోయి మెయిన్ రోడ్డు విస్తరణ వచ్చిందని స్థానికులు బాహాటంగానే చెప్పుకున్నారు. ఇలా ప్రతి అంశంపైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కస్సుమంటూ కాలుదువ్వటంపై స్థానికులు ఆశ్చర్య పోతున్నారు.

తాజాగా నవంబర్ నెలలో మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టి 100 రోజులైనా పూర్తి కాలేదని ఆరోపిస్తూ ధూళిపాళ్ళ, జనసేన నేతలతో కలిసి మహా ధర్నా నిర్వహించారు. ఆ మరుసటి రోజే ధూళిపాళ్ళపై హత్యాయత్నం కేసు నమోదైంది. సంగం డెయిరీ వద్దకు బోనస్ అడగటానికి వచ్చిన రామునిపై దాడి చేశారని ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. అయితే ఈ కేసులో హైకోర్టు ధూళిపాళ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సంగం డెయిరీ ప్రతిష్టను దిగజార్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ధూళిపాళ్ళ మండిపడ్డారు.రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమే రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఇద్దరి నేతల వాదోపవాదాలు ఎలా ఉన్నా, ప్రజలు మాత్రం అభివృద్ది చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.