secretariat
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సచివాలయాలే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 రకాల సేవలను అందిస్తున్నారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా సేవలందించనున్నారు. జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం ద్వారా పేదలకు ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక ఉత్తర్వులు జారీచేసింది. సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎస్ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏపీ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908 ఈ చట్టంలోని నెంబరు 16 సెక్షన్‌ 7 సబ్‌ సెక్షన్‌(1) కింద ఉన్న అధికారాలను అమలు చేయడంలో ఇతర నోటిఫికేషన్లను పాక్షికంగా సవరించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషనర్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్, రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. భూముల రీ సర్వే పూర్తై, ఎల్‌పీఎం నంబర్‌ వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయగా, రెండోదశలో 1500 సచివాలయాల్లో అమలు చేశారు.

మూడో దశలో 2,526 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. తాజాగా మరికొన్ని గ్రామాలకు ఈ సేవలను విస్తరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలపై శిక్షణ కూడా ఇచ్చారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది.