తిరుపతి అర్బన్ పరిధిలోని వారికి కట్టిస్తున్న జగనన్న ఇళ్ళు సకాలంలో, నిర్ణయించిన మేరకు పూర్తి చేసేలా అధికారులు పనులు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం హౌసింగ్ అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ హరిత ప్రత్యేక సమావేశం నిర్వహించగా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలోని అర్హులైన ప్రజలకి చిందేపల్లి, సూరప్పకశం, ఎం.కొత్తపల్లి, జీ పాళెం, కల్లూరు, టిసి అగ్రహారం లే అవట్లలో నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసి, అనుకున్న మేరకు జనవరి నెలాఖారు కంతా పూర్తి చేయాలని, ఫిబ్రవరిలో లబ్ధిదారులకు అందజేసేలా గృహప్రవేశాలకు సిద్దం చేయాలన్నారు.
ఇటుకల కొరత రాకుండా ఇటుకలు తయారు చేసే వారితో ముందే అగ్రీమెంట్ చేసుకోవాలని, అదేవిధంగా సిమెంట్, ఇసుక కొరత రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ హరిత సూచించారు. అన్ని లే అవుట్లలో నీరు, కరెంట్ అందుబాటలో వున్నాయని, ఎక్కడైన వాటిపై సమస్యలు వుంటె, తక్షణమే మరమ్మత్తులు చేయించి సిద్దంగా వుంచుకోవాలన్నారు. ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులు సమన్వయంతో ఇంటి నిర్మాణ కంట్రాక్టర్లతో పనులు చేయించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఓ.ఎస్.డి రామచంధ్రా రెడ్డి, పి.డి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు పాల్గొన్నారు.