brs-cong
తెలంగాణ రాజకీయం

గులాబీ హ్యాట్రిక్ సాధ్యమేనా

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. తెలంగాణలో ఓటింగ్‌ ముగిసిన తర్వాత సాయంత్రంలోగా వెలువడే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలపైనే అందరి దృష్టి ఉంటుంది అధికార భారత రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు విపక్ష కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ అయితే బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే డీ అన్నట్లుగా ప్రచారం నిర్వహించింది. ఇక చివరకు ప్రచారంలో బీజేపీ కూడా జోరు పెంచింది. వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుండగా, రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ గట్టిపోటీనిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్‌ ప్రచారం ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని అవినీతిని లక్ష్యంగా చేసుకుంది. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇక బీజేపీ ‘డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం’ పేరుతో ప్రచారం చేసింది. కుటుంబ రాజకీయాలతో గులాబీ పార్టీపై ఎదురు దాడి చేసింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సమయంలో అనేక సమావేశాలలో ప్రసంగించారు, భారీ అభిమానుల మధ్య సోమవారం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించడంతోపాటు, కేసీఆర్‌ 96 ఎన్నికల సభలు నిర్వహించారు. ప్రధాని మోదీతో పాటు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులతోపాటు కాంగ్రెస్‌ నేతలు మల్లిక్‌ర్జాన ఖర్గే, రాహుల్‌ గాంధీ తమ తమ పార్టీ అభ్యర్థుల కోసం ఓట్ల కోసం ప్రచారం చేశారు.తెలంగాణలో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు కొన్ని మిత్రపక్షాలను కూడా చేర్చుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలబెట్టింది. సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ తన మిత్రపక్షమైన సీపీఎంకు ఒక సీటు ఇచ్చింది.

అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం హైదరాబాద్‌లోని తొమ్మిది సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరీహోరీ పోరు జరిగింది. త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఓటరు నాడి మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ చిక్కలేదు. సర్వే సంస్థలు కూడా స్పష్టంగా ఫలితాలు వెల్లడించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు తీర్పు ఎటు ఉంటుందో అన్న ఆసక్తి, ఆందోళన మూడు ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది.