barrelakka-sirisha
తెలంగాణ రాజకీయం

బర్రెలక్క క్రేజ్ మాములుగా లేదుగా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది శిరీష అలియాస్ బర్రెలక్క. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయి? విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది. బర్రెలక్క విజయం సాధిస్తుందా? గురువారం ముగిసిన పోలింగ్‌లో ఆమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వెలువడిన ‘ఆరా మస్తాన్ సర్వే’ శిరీషకు 15 వేల వరకు ఓట్లు రావొచ్చని లెక్కగట్టింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందనున్నారని విశ్లేషించింది.  ఆ తర్వాత, సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్లేషించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పిన సందర్భాలను ఎన్నో చూశామని, బీఆర్ఎస్ 70 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ధైర్యం చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం టర్నవుట్ యాప్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 70.53 శాతం పోలింగ్ నమోదైంది.నాగర్కర్నూల్ జిల్లా పెద్ద‌ కొత్త‌ప‌ల్లి మండ‌లం మ‌రిక‌ల్ గ్రామానికి చెందిన శిరీష అలియాస్ బర్రెలక్క నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి మద్యానికి బానిసయ్యాడు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లితో కలిసి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుంది. ఓపెన్ యూనివ‌ర్శిటీలో డిగ్రీ చేసి.. గ్రూప్-1, గ్రూప్-2 ఇత‌ర పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయ్యింది. ఎన్నోసార్లు ప్రయత్నించిన శిరీష.. ఇక తనకు ఉద్యోగం రాదంటూ.. అందుకే నాలుగు బర్రెలు కొనుక్కుని కాస్తున్నాంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల గురించి చెబుతూ ఓ రీల్ చేసింది.

అయితే, 30 సెకన్లు ఉన్న ఆ రీల్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ కావడంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్అయింది. ఆ ఫేంతోనే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్లారు. సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అన్ని వర్గాల మద్దతు ఆమెకు లభించింది. దీంతో బర్రెలక్క భవితవ్యంపై చర్చ జరుగుతోంది.