CRPF-nagarjun
తెలంగాణ రాజకీయం

సీఆర్‌పీఎఫ్‌ బలగాల ఆధీనంలోకి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దురాక్రమించిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు 13 గేటు వరకు తమదేనంటూ ఏపీ పోలీసులు బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశాయి. దీంతో తెలంగాణ పోలీసులు కూడా ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను కృష్ణా బోర్డు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. దీంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఒక్కో పాయింటును స్వాధీనం చేసుకుంటున్నాయి. కాగా, సాగర్‌ డ్యామ్‌ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.కాగా, సాగర్‌ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమాశం జరుగుతున్నది. రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశమయ్యారు.

కేంద్ర జలసంఘం, కేఆర్‌ఎంబీ అధికారులు నేరుగా హాజరుకాగా, ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. సాగర్‌, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యలు, వాటి పరిధిలో ఉన్న అనుబంధ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు బదిలీచేసే అశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.