టీపీసీసీ ఛీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీని రాష్ట్రంలో తొలిసారి గెలిపించిన నేతగా సంచలనం సృష్టించారు.తెలుగు రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఆది నుంచి సంచలనాలకు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు.ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే, అధిష్టానం ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా విశేషం.తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎల్పీ లీడర్ పదవిలో ఉన్న ఆయన, హఠాత్తుగా కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్షుడి వరకు ఎదగడానికి నేపథ్యం కూడా ఉంది.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీన పడింది. ఎమ్మెల్సీల అభ్యర్ధుల ఓట్ల కోసం డబ్బును ఎరవేశారన్న ఆరోపణలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక్కడి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో నడిపించే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది.కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడటం, కీలక నేతలంతా అధికార పార్టీలో చేరడమో, లేదంటే పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండటమో చేయడంతో అధికార పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కష్టతరంగా మారింది.అప్పటికే ఎమ్మెల్సీ ఓట్ల కోసం డబ్బులు లంచంగా ఇవ్వజూపారన్న కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు మళ్లారు.కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో రేవంత్ రెడ్డి 2017 లో కాంగ్రెస్‌లో చేరారు.2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న దిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కానీ, వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒకరిగా ఎంపిక చేసింది.
ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒకరైన రేవంత్, 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2023 ఎన్నికల్లో పార్టీని నడిపించారు.రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీయార్‌కు సరితూగే ప్రత్యర్ధిని తానేనని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, అందులో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.అసమ్మతులకు, వర్గాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నాలు చేసిన రేవంత్, అటు అధిష్టానానికి కూడా చేరువయ్యారు.కర్ణాటక తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సమయంలో రేవంత్ వారి వెంట ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు.పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సీనియర్ నేతల నుంచి విమర్శలు వస్తున్నా తనదైన శైలిలో పని చేసుకుపోతున్నారన్న పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాగల వ్యక్తి అన్న స్థాయికి పార్టీలో రేవంత్ ప్రాబల్యం పెరిగింది.
పార్టీలోకి వచ్చిన కొత్తలోనే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్ధినేనంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రేవంత్, ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తన మనోభావాన్ని ప్రజల ముందుంచారు. రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు సహకరించాలి’ అంటూ కొడంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి ప్రజలను కోరారుఈ వ్యాఖ్య ద్వారా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని ఆయన పరోక్షంగా చెప్పారు.
119 నియోజకవర్గాలకు బాధ్యత వహించాల్సిందిగా నన్ను అధిష్టానం కోరింది. పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రానికే నాయకుడు కదా. 119మంది బీఫామ్ మీద నేనే సంతకం చేశాను కదా. అంటే రాష్ట్రానికి నాయకత్వ బాధ్యత వహిస్తున్నట్లేగా?’’ 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేట్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్-ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావటంతో ఏసీబీ ఆ సంవత్సరం మే నెలాఖరులో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.ఆయనతో పాటు బిషప్ సెబాస్టియర్ హ్యారీ, ఉదయ్ సింహా అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో రేవంత్‌రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు.దాదాపు దశాబ్దన్నర కాలంగా రేవంత్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో ఉన్నారు. అంతకు ముందు ఆయన విద్యార్ధి సంఘాల్లో క్రియాశీలకంగా ఉండేవారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఏవీ కాలేజీలో డిగ్రీ చదివిన రేవంత్ రెడ్డి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ విద్యార్ధి సంఘం అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఏబీవీపీ)లో కార్యకర్తగా పని చేశారు.2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎన్నికైన రేవంత్ రెడ్డి, 2018లో మాత్రం ఆ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో దేశంలోనే అతిపెద్ద నియోజక వర్గమైన మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
2006లో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రేవంత్ రాజకీయాల్లో ప్రవేశించారు. అంతకు ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా చేరారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఆ యేడాది స్వతంత్ర అభ్యర్ధిగా మహబూబ్ నగర్ జిల్లా మిడ్జెల్ మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుంచే కేసీఆర్ పైనా ఆయన కుటుంబం పైనా తీవ్రపదజాలంతో విరుచుకుపడే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. అసెంబ్లీలో గవర్నర్‌పై కాగితాలు విసిరేయడం లాంటి పనులు చేసినా అప్పట్లో ఆయనకు సమైక్యవాదుల్లో గ్లామర్ సంపాదించి పెట్టింది కేసీఆర్‌పై వ్యతిరేకతే.తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేకుల కూడలిగా చెప్పుకోదగిన వారిలో ఆయన ఒకరుకేసీఆర్‌పైనా, ఆయన కుటుంబం సభ్యులపై ఆయన పరిధులు దాటి తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
తాజా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధిపతికి తానే సరిజోడు అనిపించుకునేందుకు ప్రతీకాత్మకంగా ఆయన మీద రేవంత్ స్వయంగా పోటీ చేశారని చెబుతారు.కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్‌తోపాటు, కామారెడ్డి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా, రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గం కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీకి దిగారు.1969 నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి జన్మించారు రేవంత్ రెడ్డి. తండ్రి అనుముల నర్సింహా రెడ్డి, తల్లి రామచంద్రమ్మ.హైదరాబాద్‌లోని ఎ.వి. కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి దగ్గరి బంధువైన గీతతో 1992లో ఆయన వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.