తెలంగాణ ముఖ్యాంశాలు

ప్రతి ఎకరం పారాలి

  • కష్టపడి తెచ్చుకున్నం.. కాస్త తెలివితో వాడుకుందాం
  • సత్ఫలితాలిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు
  • ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉండొద్దు
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం
  • సిరిసిల్లలో సాగునీటి అధికారులతో సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కష్టపడి గోదావరి నీళ్లను తెచ్చుకున్నాం.. ప్రతి ఎకరాకు పారేలా వాటిని కాస్త తెలివితో వాడుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ను ఒడుసుకుంటూ పోతున్న గోదావరి జలాలతో ప్రతి గ్రామం, ప్రతి ఎకరం అనుసంధానం కావాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సాగునీటి పారుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలితాలిస్తున్నదని, ఎన్నో కష్టాలుపడి లిఫ్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకుంటూ తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నామని తెలిపారు. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యం మరింతగా అర్థమవుతుందని.. కరువు, కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాటుచేసుకున్నామని వివరించారు. ఇప్పుడు నీళ్లు మన చేతిలో ఉన్నాయని, వాటిని ఎట్లా వాడుకుంటామనేది తెలివితో ముడిపడి ఉన్నదని కేసీఆర్‌ చెప్పారు. జలాశయాలను నిండుకుండలా మార్చుకున్నాక కూడా గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనే మాటే వినబడకూడదని సూచించారు. మూలమూలన గోదావరి జలాలు ప్రవహించాలని స్పష్టంచేశారు. చిన్నపాటి లిఫ్ట్‌లు ఏర్పాటుచేసుకుని వానకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు పోత్తిపోసుకోవాలని సూచించారు. అక్కడినుంచి తిరిగి గ్రావిటీ ద్వారా పొలాలకు మళ్లించుకోవాలని వివరించారు.

నీళ్ల వినియోగబాధ్యత మీదే
రాడార్‌ పరిధిలోని అన్ని చెరువులను నూటికి నూరుశాతం నింపాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే’ అని ప్రజాప్రతినిధులు, ప్రజలకు పిలుపునిచ్చారు. జూలై 10వ తేదీ తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చుని సాగునీటి సరఫరాపై చర్చించుకోవాలని పిలుపునిచ్చారు. నెత్తిమీద నీళ్లు పెట్టుకుని బాధపడటం సరికాదని చెప్పారు. అప్పర్‌ మానేరు కరీంనగర్‌కు వరదాయినని, మానేర్‌కు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఇక నుంచి కరీంనగర్‌ జిల్లాలో రైతులు రోహిణి కార్తెలోనే నాటు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులేదేనని ఉద్బోధించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లంతకుంట మండలం అనంతగిరిని సందర్శిస్తానని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. రైతుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్‌, జడ్పీ చైర్మన్‌ అరుణ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • థ్యాంక్స్‌ టు కాళేశ్వరం ప్రాజెక్ట్‌
  • సిరిసిల్లలోనూ వ్యవసాయం పెరిగింది
  • చిన్న జిల్లాలతో పరిపాలన చేరువైంది
  • మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఆసక్తికర ట్వీట్లు చేశారు. సీఎం ప్రారంభించే కలెక్టరేట్‌, నర్సింగ్‌ కాలేజీ, వ్యవసాయ మార్కెట్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టారు. కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, నర్సింగ్‌ కాలేజీ, ఆధునిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ఫొటోలు పోస్ట్‌ చేస్తూ, తెలంగాణ మొత్తం పెరుగుతున్నట్టే సిరిసిల్లలోనూ వ్యవసాయం పెరుగుతున్నదని, వ్యవసాయ ఉత్పత్తులకు సహాయపడేందుకు ఆధునిక వ్యవసాయ యార్డును అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్లలో వ్యవసాయం పెరిగేందుకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కృతజ్ఞతలు అని వెల్లడించారు. జిల్లాను హెల్త్‌కేర్‌లో ముందుంచడానికి నర్సింగ్‌ కాలేజీ తీసుకొస్తున్నట్టు వివరించారు. చిన్న జిల్లాల్లో అతి తక్కువ సమయంలో పాలన ప్రజలకు మరింత చేరువవుతున్నదని సమీకృత కలెక్టరేట్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌లో 59 పార్కులు
మొత్తం 1.6 లక్షల ఎకరాల హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌లో 59 పార్కులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అంబర్‌కలన్‌ పార్కును పొగుడుతూ గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ ఏ సస్టేనేబుల్‌ ప్లానెట్‌ చీఫ్‌ మెంటార్‌, గ్రీన్‌ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ సోల్హిమ్‌ ట్వీట్‌ చేశారు. ‘బ్రావో హైదరాబాద్‌. ఈ భారతీయ మెగాసిటీ ప్రపంచ ప్రముఖ హరితనగరం. ఈ వారం అంబర్‌కలన్‌లో మరో అర్బన్‌ పార్క్‌ మొదలైంది. అందమైన పార్క్‌, గొప్ప వాకింగ్‌ ట్రాక్స్‌, యోగా సెంటర్‌ కూడా’ అని ఎరిక్‌ ట్వీట్‌ చేయగా మంత్రి కేటీఆర్‌ పైవిధంగా స్పందిస్తూ థ్యాంక్స్‌ ఎరిక్స్‌ అని రిైప్లె ఇచ్చారు.