cyber crime
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

అనంతలో 300 కోట్ల సైబర్ మోసం

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందనలో ఫిర్యాదు చేశారు. అతను తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ కుమార్ అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తన ఫోన్ లోని టెలిగ్రామ్ యాప్ లో అతనికి సెప్టెంబర్ 21న ఒక మెసేజ్ వచ్చింది. మీకు ఏమైనా పార్ట్ టైమ్ జాబ్ చేయాలని ఉందా అని లింక్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ కు ఆశపడి అనిల్ కుమార్ ఆ లింకును ఓపెన్ చేశాడు. నిర్వాణ డిజిటల్ గ్రూపులో ఆడ్ అయ్యారు. అనిల్ కు ప్రత్యేక యూజర్ ఐడి కూడా వచ్చింది. యూజర్ ఐడి ద్వారా నకిలీ పోర్టల్ లో యూట్యూబ్ వ్యాపార ప్రకటనలు అవతలి వారికి పంపిస్తుండాలని.. వాటిని సబ్‌స్క్రైబ్ చేసి రేటింగ్ ఇవ్వాలని.. ఇలా చేస్తే అధికంగా కమిషన్లు వస్తాయని నమ్మించారు. ముందుగా రూ.10 వేలు డిపాజిట్ చేస్తే వీడియోలు పంపిస్తామన్నారు. తన వద్ద డబ్బు లేదనడంతో మేమే చెల్లిస్తామంటూ రూ.10 వేలు కట్టినట్లు నకిలీ ఆధారాలు చూపించారు.

అనిల్ కుమార్ అది నిజమని నమ్మి వారు పంపిన వీడియోలకు సబ్‌స్క్రైబ్ చేసి రేటింగ్ ఇచ్చాడు. మొదటగా రూ.800 కమిషన్ రూపంలో అనిల్ కుమార్ ఖాతాలో జమ అయ్యింది. దీంతో అనిల్ కుమార్ కు నమ్మకం ఏర్పడింది. ఇంకా ఎక్కువగా కమిషన్ రావాలంటే రూ.10 వేలు కట్టాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు. పేటియం ద్వారా యూజర్ ఐడీకి పది వేలు పంపాడు. సైబర్ నేరగాళ్లు వీడియోలు పంపారు. కమిషన్ రూపంలో రెండోసారి రూ.2,625 వచ్చింది. తర్వాత సైబర్ నేరగాళ్లు ఒకేసారి రూ.50 వేలు పంపమన్నారు. అనిల్ కుమార్ అలాగే పంపాడు చివరకు ఖాతా హోల్డ్ లో పెట్టారు. మరోసారి రూ.1,50,000 పంపమని డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని వాళ్ళ ఖాతాల్లో వేశారు. అయినప్పటికీ ఐడీ హోల్డ్ లోనే ఉంది. ఎందుకు నా ఐడీ ఇంకా హోల్డ్ లో పెట్టారని అడగ్గా.. మరో నాలుగు లక్షల రూపాయలు పంపితే మొత్తం డిపాజిట్ అమౌంట్ తిరిగి పంపిస్తామని చెప్పారు. అంత డబ్బు కట్టలేనని చెప్పడంతో అనిల్ ఐడిని ఏకంగా బ్లాక్ చేశారు. ఐడిని బ్లాక్ చేయడంతో మోసపోయాడని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ఆధారంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో సైబర్ నేరగాళ్ల జాడ కోసం టెక్నికల్ టీం సపోర్ట్ తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయే లావాదేవీలు అందులో కనుగొన్నారు.

సుమారుగా రూ.300 కోట్లకు పైగా ఈ సైబర్ నేరగాళ్లు నిరుద్యోగ యువత నుంచి డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి పోలీసులను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి మరింత లోతుగా విచారించాలని ఆదేశించారు. ఈ నేరగాళ్లలో ఆరుగురు ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్ చేసిన వారికి చెందిన 16 నకిలీ ఖాతాల నుంచి రూ.35 కోట్ల 59 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. రూ.14 కోట్ల 72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ కేసు విచారణలో భాగంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో సుమారు 1,550 ఫిర్యాదులు ఉండగా వీటిలో లావాదేవీల అంచనా వేస్తే సుమారు రూ.300 కోట్లపై మాటే అని వెల్లడించారు. ఈ కేసులో ఎలాగైనా ప్రధాన నిందితుణ్ని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో పోలీసు బృందం రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లారు. టెక్నికల్ టీం ఆధారంగా కీలక నిందితుడు జమ్మూ కశ్మీర్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వెంటనే జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన జిల్లా పోలీసులు సైబర్ నేరాల్లో ఆరు తేదీన కింగ్ పిన్ అనాయతుల్లా అలియాస్ ఫర్హాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జమ్మూ కశ్మీర్ పోలీసుల సహకారంతో అనాయతుల్లాను స్థానిక కుల్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ట్రాన్సిట్ వారెంట్ పై అనంతపురం జిల్లాకు తీసుకువచ్చి రిమాండ్ కు పంపారు.