michaung
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మిగ్ జాం తుఫాను… అంచనా వేసే పనిలో అధికారులు

మిగ్‌జామ్‌ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ రైతులను నిండా ముంచేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట మొత్తం నీటిపాలైంది. తుఫాన్‌  ప్రభావిత జిల్లాల్లో ఎటు చూసినా నీట మునిగిన పొలాలు.. నేలకొరిగిన పంటచేలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వీలైనంత త్వరగా వారికి నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తోంది. రైతులకు అండగా నిలవాలని అధికారులను కూడా ఆదేశించారు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. వ్యవసాయ, ఉద్యాన శాఖలు,  రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పొలాల్లో ముంపు నీరు తగ్గిన తర్వాత… వెంటనే పంట నష్టం అంచనా మొదలుపెట్టాలని ఆదేశించారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అంచనాలను  సిద్ధమవుతున్నాయి ప్రత్యేక బృందాలు. మరో రెండు వారాల్లో పంట నష్టం అంచనాలను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.

ఈ నెలాఖరుకు లేదా జనవరి  మొదటి వారంలో పరిహారం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు అడుగడుగునా అండగా నిలబడాలని ఆదేశించారు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొలుగోలు చేస్తున్నారు. సాంకేతిక కారణాలను  పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ… తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటోంది. రైతులకు నష్టం జరగకుండా… తడిసి, రంగుమారిన ధాన్యాన్ని  కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి… మిల్లులకు తరలిస్తోంది. ఇక… నీటి మునిగిన పొలాలు, నేలకొరిగిన పంటల అంచనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్‌. ముఖ్యంగా… వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న,  వేరుశనగ పంటలపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది. అరటి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట… నేలకూలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి రైతులందరికీ అండదండగా నిలవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

ఖరీఫ్‌ సీజన్‌లో 64 లక్షల ఎకరాల్లో వ్యవసాయం, 29  లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక 17 లక్షల  ఎకరాల్లో పంటల కోతలు పూర్తయ్యాయి. మరో 15 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మిగ్‌జామ్‌ తుఫాన్‌ కారణంగా… 80వేల ఎకరాల్లో పంటలు  ముంపునకు గురయ్యాయని… కోతకు సిద్ధంగా ఉన్న లక్ష ఎకరాలకు పైగా పంట నేలకొరిగినట్టు ప్రాథమికంగా అంచనా చేశారు అధికారులు. అయితే… పూర్తిస్థాయిలో  పంటనష్టం అంచనాలు సిద్ధం చేయాలని ప్రత్యేక బృందాలను పంపుతోంది ఏపీ ప్రభుత్వం.ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ఆర్బీకే సిబ్బంది కూడా రోజూ రైతులతో మాట్లాడుతూ… వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. తుఫాన్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి పంటచేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.