ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. మళ్లీ ఎన్నికలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఒకటి విశాఖ రైల్వే జోన్. ఉత్తరాంధ్ర వాసుల సెంటిమెంట్ అయిన విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాుటు చేస్తున్నట్లుగా 2019 ఎన్నికలకు ముందు కేంద్రం ప్రకటించింది. కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ కనీసం ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్రం అంటోంది. కానీ భూమి అవసరం లేదని రాష్ట్రం వాదిస్తోంది. ఈ పీటముడి పడిపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగకపోవడంతో రైల్వేజోన్ అంశం ఇప్పటికీ సాకారం కాలేదు. ఎపి విభజన చట్టం సెక్షన్ 93 షెడ్యూల్(8) ప్రకారం రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎనిమిదేళ్లయినా పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేయమని ప్రజలు అడిగితే….ఏటా రూ.8200 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న రైల్వే డివిజన్‌ను ఎత్తివేస్తామని ప్రకటించింది. అదే సమయంలో జోన్ ఏర్పాటుకు విశాఖలో అన్ని వసతులూ ఉన్నా మీనమేషాలు లెక్కిస్తోంది. డివిజన్‌ను కొనసాగిస్తూ జోన్ ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష.
రాజకీయ లబ్ధి కోసం బీహార్‌లో ఆఘమేఘాల మీద జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం…. ఇక్కడ ఎనిమిదేళ్లయినా వినిపించుకోవట్లేదు. అన్ని పరిశీలనలు పూర్తి చేసి ఐదేళ్ల కిందట ప్రకటన చేసినా అది పేపర్లలోనే ఉంది. రైల్వే బోర్డు డీపీఆర్ ఎప్పుడో రెడీ అయింది. తొలి డిపిఆర్‌లో రూ.300కోట్ల వరకూ ప్రతిపాదన పెట్టగా కేంద్ర రైల్వే శాఖ రూ.176 కోట్లకు సవరించి పంపించింది. ఉద్యోగులు, సిబ్బంది మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే బోర్డు కోరగా పంపించారు. అంటే డిపిఆర్‌ను పరిశీ లించడమే కాదు.. ఆమోదించడమూ జరిగింది… సవరణలు కూడా చేశారు.. డిపిఆర్‌ను పరిశీలిస్తున్నామంటూ పార్లమెంట్ లో రైల్వే శాఖా మంత్రి ప్రకటించారు కూడా. తాజాగా రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ రైల్వే శాఖ అధికారుల ప్రకటన తర్వాత ‘వదంతులు నమ్మొద్దు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే నిర్మించేందుకు భూమి, నిధులు అందు బాటులో ఉన్నాయని చెబుతున్నారు.
రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం పక్కనే నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం 2017లోనే రైల్వే అధికారులు స్థలాన్ని సిద్ధం చేసి, డిపిఆర్‌లో పొందుపరిచారు. కానీ కేంద్రంలోని బిజెపి రాజకీయ జాప్యం చేస్తూనే ఉంది. విశాఖను రైల్వే డివిజన్‌గా కేంద్రం.. అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను మాత్రం రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్‌లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే… విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్‌లో ఉన్నాయి. వీటిని కూడా.. విశాఖ రైల్వేజోన్‌లో చేర్చలేదు. రైల్వే జోన్ ఇంకా పేపర్ల మీదకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ రాయగడ డివిజన్ పనులు మాత్రం పూర్తయ్యాయి. రాయగడ డివిజన్ ఏర్పాటుకు మౌలిక వసతులేమీ లేవు. అయినా అటు రైల్వేబోర్డు, ఇటు తూర్పుకోస్తా రైల్వేజోన్ రాయగడలో ఏర్పాట్ల మీద కోట్లు ఖర్చు చేసింది. .
రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాల పెంపు, ఇతర భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాయగడలో ఏర్పాట్ల కోసం నోడల్ అధికారిని నియమించారు. డివిజన్‌లో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్‌పీఎఫ్ వ్యవస్థ ఏర్పాటు కోసం రాయగడలో నిర్మాణాలు జరుగుతున్నాయి. డివిజన్ స్థాయి అధికారుల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు మాత్రం ఎక్కడిదక్కడే ఉంది.ఎపి విభజన హామీల్లో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు నూతన రైల్వే జోన్ వంటి అన్నింటినీ తుంగలో తొక్కుతూ హామీలకు తూట్లు పొడుస్తోంది బిజెపి. ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు పునర్విభజన చట్టం సెక్షన్ 93, షెడ్యూల్ (3)లో పేర్కొన్నా, 2016 సంవత్సరం నుంచీ నాన్చుతూనే ఉంది. 2019లో ఎన్నికలకు ముందు విశాఖ నగరంలో బిజెపి ర్యాలీ, సభకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖలో ప్రారంభిస్తానని ప్రకటించి ఈ ప్రాంత ప్రజలు, రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగుల్లో ఆశలు రేపాయి.
కానీ, కేంద్ర సర్కారు నయవంచన ఎంతకాలం? అంటూ తాజాగా వీరు ప్రశ్నిస్తున్నారు. రైల్వే డిఆర్‌ఎం కార్యాలయంలో 15 ఎకరాల స్థలం భవనాల కోసం సిద్ధంగా ఉన్నా భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ రైల్వే మంత్రి, రాజ్యసభ సభ్యులు జివిఎల్ వంటి వారు ప్రచారం చేస్తున్నారని వైసీప నేతలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి గతంలో రైల్వే భూమి బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (బిఆర్‌టిఎస్) కోసం 2015లో 52.2 ఎకరాలను ముడసర్లోవలో రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. దీంట్లో పది ఎకరాలు మాత్రమే వివాదంలో ఉంది. వివాద రహిత భూమిలో జోన్ పనులకు ఆటంకం ఏమిటి? అంటూ రైల్వే ఇంజనీరింగ్ అధికారులు వాపోతున్నారు.ప్రస్తుతానికి , కేంద్రం రాష్ట్రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు కానీ.. రైల్వేజోన్ మాత్రం సాకారం కావడం లేదు.