తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి ప్రజావాణి కార్యక్రమం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని… సమస్యలతో సతమతమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి… అక్కడే ప్రజావాణి కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు జనం.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ ను ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ రోజు శుక్రవారం కావడంతో ప్రజావాణి కార్యక్రమానికి సామాన్యుల నుంచి భారీ స్పందన లభించింది. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతి రావ్ ఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల వరకూ వచ్చిన వారికి మాత్రమే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో ముందుగా బేగంపేటకు ప్రజాభవన్ కు చేరుకున్నారు.తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలి రోజు నుంచే విశేష స్పందన లభిస్తోంది. బేగంపేట నుంచి పంజాగుట్ట ఫ్లై ఓవర్ వరకూ అర్జీదారులు బారులు తీరారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మార్గం మొత్తం తీవ్ర ట్రాఫిక్ ఏర్పాడింది. ప్రజాభవన్ వద్ద ఎలాంటి వాహనాలు నిలిపేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు పంపుతూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అధిక సంఖ్యలో వినతులు ఇస్తున్నారుప్రజావాణికి విశేష స్పందన వస్తుండటం… సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వస్తుండటంతో… రద్దీ విపరీతంగా పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మాత్రమే కాకుండా… అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ప్రజావాణి నిర్వహిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. దీని వల్ల.. ఆయా నియోజకవర్గ ప్రజల సమస్యలకు… ఆయా నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారం చూపినట్టు అవుతుంది. అంతేకాదు.. వారంతా హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ప్రజాభవన్ దగ్గర రద్దీ కూడా తగ్గుకుంది. దీని వల్ల అటు ప్రభుత్వ యంత్రాంగానికి… ఇటు ప్రజలకు భారం, ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది