తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలే కీలకమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వాటిని పరిరక్షించేందుకు పోలీసు శాఖ రాత్రింబవళ్లు శ్రమిస్తోందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచారని, వారంతా ప్రజల హృదయాల్లో త్యాగ ధనులుగా నిలిచారన్నారు. నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం. సైబర్ నేరాలకు సమర్థవంతంగా అడ్డుకట్ట వేయాలని సూచించారు. తెలంగాణ పోలీసుల విధానాలను మిగతా రాష్ట్రాలను పాటిస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ ల్యాబ్.. అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం యువతను పట్టిపీడిస్తోందన్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, వీటి కట్టడికి సరికొత్త చర్యలు చేపడు తున్నట్లు వివరించారు. డ్రగ్స్ భూతంపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ ధ్వంసంపై నోరు విప్పారు.
ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు. మందిరాలు, మసీదులపై దాడులకు తెగబడుతున్నారు. నేరాల తీరు మారుతోందని, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలన్నారు.రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఖద్దర్, ఖాకీలే సమాజానికి రోల్ మోడల్స్ అని చెప్పుకొచ్చారు. మనం బాగుంటే.. సమాజం మనల్ని గౌరవిస్తుందన్నారు.సమాజంలో అందరికీ రక్షణ కల్పించేది ఖద్దర్, ఖాకీలేనని.. అలాంటి వారిని ఎవరైనా చులకనగా మాట్లాడే స్థితి తీసుకు రావద్దన్నారు. ఎవరి వద్ద చేయి చాచకుండా ఆత్మగౌరవంతో బతకాలని ఆకాంక్షించారు. పోలీసుల పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పకనే చెప్పారాయన.పోలీసుల సంక్షేమానికి ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎస్సై, సీఐలు మరణిస్తే కోటి 20 లక్షలు, డీఎస్సీ, ఏఎస్పీలకు రూ. కోటిన్నర నష్ట పరిహారం ఇస్తామన్నారు.
శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ. 60లక్షలు చెల్లిస్తామన్నారు.ఎస్పీ, ఐపీఎస్‌లు మరణిస్తే రెండు కోట్ల రూపాయలు, అంగవైకల్య మైతే కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. అంతకుముందు పోలీసు సంస్మరణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సిటీలోని గోషామహల్ స్టేడియంలో విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు ముఖ్యమంత్రి నివాళులర్పించారు.