అంతర్జాతీయం

అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ బాధ్యతలు

నేడు సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న బెజోస్

ప్ర‌పంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈఓ పదవి నుంచి నేడు తప్పుకోగా, ఆయన స్థానంలో ఆండీ జాస్సీ (53) నూతన సీఓఈగా బాధ్యతలు అందుకున్నారు. జెఫ్ బెజోస్ అమెజాన్ ను 1994లో స్థాపించారు. అనతికాలంలోనే తిరుగులేని ఈ-కామర్స్ పోర్టల్ గా అమెజాన్ ఎదగడంలో బెజోస్ పాత్ర ఎనలేనిది. 1.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ శక్తిగా అమెజాన్ ను మలిచిన బెజోస్ తాను సీఈఓగా తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తన స్థానంలో ఆండీ జాస్సీ ఇకపై కంపెనీని నడిపిస్తారని వెల్లడించారు.

అమెజాన్ ఇప్పుడు ఈ-మార్కెట్ రంగంలోనే కాదు ఓటీటీ (అమెజాన్ ప్రైమ్), క్లౌడ్ కంప్యూటింగ్ ( అమెజాన్ వెబ్ సర్వీసెస్) రంగాల్లోనూ దూసుకుపోతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాసుల వర్షం కురిపించే సంస్థగా ఎదగడంలో నూతన సీఈఓ ఆండీ జాస్సీ కృషి ఎంతో ఉంది. వెబ్ సర్వీసెస్ రంగంలో ఆదాయాన్ని పసిగట్టిన జెఫ్ బెజోస్ ఏడబ్ల్యూఎస్ కు రూపకల్పన చేయగా, దాన్ని లాభాల బాట పట్టించింది ఆండీ జాస్సీ. జాస్సీ… ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా అందుకున్నారు. క్రీడల పట్ల మక్కువ చూపించే అమెజాన్ నూతన సీఈఓ తన ఇంటిలోనూ క్రీడా వేదికలను తలపించే నిర్మాణాలతో తన అభిరుచిని చాటుకున్నారు.