మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్-కూకట్‌పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది.
ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూకట్‌పల్లి-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.