assembly
తెలంగాణ రాజకీయం

ఇవాళ్టి నుంచి అసెంబ్లీ

తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది.. మున్ముందు రాజకీయాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే.. అంశంపై అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా తొలి సమావేశాలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా తొలి సమావేశాలే హాట్ హాట్‌గా సాగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించాయి. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే.. దేనికైనా రెడీ అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చిచెప్పింది. గతాన్ని గుర్తూ చేస్తూ గులాబీ పార్టీని కట్టడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుంటే.. ఆ గతాన్నే తమ బలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది కేసీఆర్‌ టీమ్. తొలి సమావేశాల్లోనే అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్‌లో సాగింది. అయితే, వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు మళ్లీ బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

ఈ తరుణంలో కాంగ్రెస్ సర్కార్ శాఖలవారీగా శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామని చెబుతుండటంతో బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది.ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే.. భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అనుమతి మంజూరు చేయాలంటూ హరీష్ రావు లేఖ రాశారు. హరీష్ రావు లేఖలో ఏం రాశారంటే.. ‘‘రేపటి నుంచి జరిగే శాసనసభ సమావేశాలలో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది. ఒక వేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతించినట్లైతే, దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మా వెర్షన్ చెప్పవలసి ఉంటుంది. మేము కూడా సభలో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కావున భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వగలరని మనవి.’’ అంటూ తన్నీరు హరీష్ రావు స్పీకర్ కు లేఖలో వివరించారు.