కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతున్నారా? కనీసం డిపాజిట్లు దక్కే ఛాన్స్ లేదా? వైయస్ అభిమానులు ఆమెను ఆదరించలేదా? వివేకానంద రెడ్డి హత్య అంశం వర్కౌట్ కాలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని కేంద్ర సంస్థల సర్వేల్లో ఇదే తేలినట్లు తెలుస్తోంది. కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు షర్మిల. ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ కడప జిల్లా ప్రజలకు ఓట్లు అడిగారు. కొంగు చాచిమరి న్యాయం చేయాలని కోరారు. అటు సునీత సైతం తన తండ్రిని హత్య చేయించిన వారికి ఓటు వేయొద్దని.. షర్మిలకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్ విజయమ్మ సైతం తన కుమార్తెను ఆదరించాలని ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. కానీ ఇవేవీ వర్కౌట్ కాలేదని కేంద్ర సర్వే సంస్థలు తేల్చడం విశేషం.వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు అని.. రాజకీయ అవసరాల కోసమే హత్య చేయించాడని షర్మిల తో పాటు సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో వైయస్ కుటుంబంలోనే చీలిక వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న షర్మిల.. రాజ కీయంగా ఎదిగేందుకు తనకు ఇదో అవకాశం అని భావించారు. ఎంపీగా పోటీ చేస్తే.. ప్రజల్లో సెంటిమెంటు రగిలించి విజయం సాధించవచ్చు అని అంచనా వేశారు. ఒకవైపు ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన తండ్రిని ఎలా హత్య చేశారో వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇంత చేసినా కడప ప్రజలు పెద్దగా చలించలేదని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. పైగా షర్మిలకు డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలియడం ఆమె అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.జాతీయస్థాయి సర్వేల్లో కడపలో అవినాష్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలియడం విశేషం. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అరకు అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వస్తుందని.. ఆ తరువాత స్థానం కడప దేనని.. అత్యధిక మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలవబోతున్నారని ఈ సర్వేలు తేల్చడం విశేషం. అదే జరిగితే వివేకానంద రెడ్డి హత్య అంశం పక్కకు వెళ్లిపోయినట్టే.
కడప ప్రజలు పట్టించుకోనట్టే. ఒకవేళ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. వివేకానంద రెడ్డి హత్య అంశం అనేది వినిపించదు. అటు షర్మిలను సైతం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. ఆమె పరపతిఅమాంతం పడిపోనుంది. ఒకవేళ జగన్ అధికారంలోకి రాకుంటే మాత్రం షర్మిల బయటపడినట్టే. ఆమెను చంద్రబాబు పావుగా వాడుకుంటారు. జగన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు ఆమెను ప్రయోగిస్తారు. అందుకే ఏపీలో గెలుపోటములను బట్టి షర్మిల పాత్ర ఉండనుంది.